క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది.  కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా అన్ని రంగాలు ప్ర‌భావితం అవుతున్నాయి. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మహా విపత్తు వల్ల దాదాపు 50 కోట్ల మంది పేరదరికంలోకి జారుకోనున్నారని నైరోబీ కేంద్రంగా పనిచేస్తున్న ఆక్స్‌ఫామ్‌ అనే స్వచ్చంద సంస్థ అంచనా వేసింది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు వచ్చే వారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రపంచబ్యాంకు సమావేశం కానున్న నేపథ్యంలో ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను విడుదల చేసింది. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం కంటే కరోనా సంక్షోభం ఎంతో తీవ్రంగా ఉండదనుందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పేదలు 1990 నాటికంటే ఎక్కువమంది తయారవుతారని, కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మూడు దశాబ్దాలు వెనక్కు పోనున్నాయని హెచ్చరించింది. 

 


మ‌రోవైపు కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా మనదేశంలో కేవలం ఎగుమతిరంగంలోనే కోటిన్నర ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్‌ అధ్యక్షుడు షరద్‌కుమార్‌ సరాఫ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్ల కారణంగా 50శాతం ఆర్డర్లు రద్దయ్యాయని తెలిపారు. భవిష్యత్తు కూడా నిరాశాజనకంగానే ఉందని దాంతో భారీగా ఉద్యోగాల కోత పడుతాయని అన్నారు. భారత్‌లోని 40 కోట్లమంది పేదలు కరోనా సంక్షోభం కారణంగా మరింత దారుణమైన పేదరికంలోకి జారిపోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రకటించిన నేపథ్యంలో షరద్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

 

కాగా, కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి  దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం సంభవించింది. దేశంలోని అన్ని రంగాల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు జీడీపీలో కనీసం 10 శాతం సొమ్మును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రకటించాలని నరెడ్కో కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడితేనే భవిష్యత్తులో నిలదొక్కుకోగలుగుతామని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్‌ హీరానందానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమయంలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: