కరోనా మహమ్మారి ప్రభావం ఉన్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటు ఈ లాక్ డౌన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కఠినంగా అమలవుతుంది. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ గడువు ముగిసినా, కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఇక తర్వాత పరిస్థితులని బట్టి దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేవేస్తామని కేసీఆర్ చెప్పారు.

 

అయితే లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు వలస కూలీలు, గిరిజన ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి పనులు లేక, ఆదాయం వచ్చే మార్గాలు లేక తినడానికి తిండి కూడా దొరకక చాలాకష్టపడుతున్నారు. ఇక పేద ప్రజలు కష్టాలని తీర్చేందుకు కొన్ని స్వచ్చంద సంస్థలు, మానవతా వాదులు, రాజకీయ పార్టీ నేతలు ముందుకొస్తున్నారు.

 

ఈ క్రమంలోనే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఇలాంటి కష్ట సమయంలో మానవత్వం చాటుకుంటున్నారు. ఎప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా నడుచుకునే సీతక్క, తన నియోజకవర్గ పరిధిలో ఉన్న పేద ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన సొంతంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే వీలైన చోట వలస కూలీలకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఇక 24 గంటల ప్రజల కోసం పని చేస్తున్న పోలీసులు, ఆశావర్కర్స్, నర్సులకు భోజనం అందిస్తున్నారు.

 

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ములుగు నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకైతే సరైన రవాణా సదుపాయం కూడా ఉండదు. అలాంటి ప్రాంతాలకు సీతక్క ట్రాక్టర్ పెట్టుకుని మరి, నిత్యావసర వస్తువులు, కూరగాయలు తీసుకెళ్లి గిరిజన బిడ్డలకు అందిస్తున్నారు. సాయం చేసే విషయంలో సీతక్క ఎలాంటి ఇబ్బందులు ఉన్న, అసలు తగ్గకుండా ముందుకెళుతున్నారు. ఏదేమైనా ఇలాంటి విపత్కర సమయంలో సీతక్క తనవంతుగా సాయం చేస్తూ, నిజమైన ప్రజాప్రతినిధి అనిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: