దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రధాని మోదీ గత నెల చివరి వారం ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటన చేశారు. తాజాగా కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ ఎత్తివేయనుందని సమాచారం. 
 
కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాలలో కేంద్రం షాపులు తెరిచేందుకు, సామాజిక దూరం పాటిస్తూ జనం రోడ్లపైకి వచ్చేందుకు అనుమతులు ఇవ్వనుంది. కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసే ప్రాంతాలలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలు అమలు జరిగేలా చర్యలు చేపట్టనుందని సమాచారం. ముఖ్యంగా కేసులు నమోదు కాని గ్రామీణ ప్రాంతాలలో కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేయనుందని తెలుస్తోంది. 
 
నిన్న ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ సమావేశంలో లాక్ డౌన్ ను కనీసం రెండు వారాలైనా పొడిగించాలని అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు. పలువురు సీఎంలు లాక్ డౌన్ వల్ల కుదేలయిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఆదుకోవాలని మోదీని కోరారు. పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరారు. 
 
ఈ సమావేశంలో మోదీ కేంద్రం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇచ్చాయో రాబోయే మూడు, నాలుగు వారాల్లో తేలుతుందని చెప్పారు. కేంద్రం దేశంలో కొన్ని ప్రాంతాలలో పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తివేయనుండగా కొన్ని ప్రాంతాలలో ఆంక్షల సడలింపుతో లాక్ డౌన్ ను కొనసాగించనుంది. ఆంక్షల సడలింపు ద్వారా ఆర్థిక చక్రం ముందుకు కదులుతుందని మోదీ భావిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: