తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 503కు చేరింది. ఇప్పటివరకూ 96 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 14 మంది మృతి చెందారు. జిల్లాలవారీగా మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకూ 243 ప్రాంతాలను ప్రభుత్వం హాట్ స్పాట్లుగా ప్రకటించింది. ఈ ప్రాంతాలలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఫ్రీ తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా మాస్క్ లను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
ఎవరైనా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించి మాత్రమే బయటకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే మాస్కుల తయారీ, కొనుగోలు, పంపిణీకు సంబంధించిన చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. ప్రభుత్వం  మహిళా సంఘాలతో మాస్కులను తయారు చేయించనుందని సమాచారం. ఒక్కో మాస్కుకు ప్రభుత్వం 15 రూపాయలు చెల్లించి మాస్కులను కొనుగోలు చేయనుంది. 
 
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల మాస్కుల పంపిణీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతి త్వరలో ప్రభుత్వం ప్రజలకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేయనుంది. దాదాపు 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం మాస్కుల కొనుగోలు, పంపిణీ కోసం ఖర్చు పెట్టనుందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ అమలవుతుందని కేసీఆర్ ప్రకటన చేశారు. పదో తరగతి పరీక్షల గురించి కొద్ది రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: