ఆలోచన మారింది...వ్యూహమూ మారుతోంది..! నిన్నటి వరకు ప్రాణాలు మాత్రమే ముఖ్యమన్నారు. కానీ ఇప్పుడు జీవితం..ఆర్ధిక వ్యవస్థ రెండూ ముఖ్యమే అంటున్నారు..! జాన్‌ భీ...జహాన్‌ భీ...అన్నది కేంద్రం కొత్త నినాదం. కరోనా మహమ్మారి విసిరిన సవాల్ నుంచి ఈ దేశాన్ని గట్టెక్కించాలంటే వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఉందని  ప్రధానమంత్రి మోడీ గుర్తించినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలు కేంద్రం అనుసరించబోయే కొత్త వ్యూహానికి అద్దంపడుతున్నాయి. 

 

కరోనా నుంచి బయటపడి ప్రాణాలతో ఉంటే...తర్వాత ఏదైనా సాధించవచ్చు అన్న ఆలోచనతో నిన్న మొన్నటి వరకు ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే మూడు వారాల లాక్‌డౌన్‌ దేశ ఆర్ధిక వ్యవస్థను షేక్ చేసేంది. రాష్ట్రాల ఖజానాలు నిండుకుంటున్నాయి. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్దిక వ్యవస్థ భవిష్యత్తుపై కూడా దృష్టి పెట్టకపోతే అసలుకే మోసం వస్తుంది. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించినట్టుగా కనిపిస్తోంది. అందుకే లాక్‌డౌన్ విషయంలో కొత్త  స్ట్రాటజీని అమలు చేయాలని నిర్ణయించింది. 

 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడగించాల్సిన పరిస్థితులను కరోనా సృష్టించింది. అయితే కేవలం లాక్‌డౌన్‌ పొడిగింపునకు మాత్రమే పరిమితమై ఆర్ధిక వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే... సమీప భవిష్యత్తులో మరింత సంక్షోభాన్ని చూడాల్సి వస్తుంది. అందుకే లాక్‌డౌన్ విషయంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. లాక్‌డౌన్‌ పొడిగించే విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలన్న ఆలోచన చేస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా కంటే.. ఆయా రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను బట్టి... అక్కడి ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మంచిదన్న ఆలోచనకు వచ్చింది మోడీ సర్కార్. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్‌డౌన్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాయి. కేంద్ర ప్రకటనతో సంబంధం లేకుండా ఈ నాలుగు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించాయి. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ కూడా  లాక్‌డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు సిద్ధంగా లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రెడ్‌జోన్లకు మాత్రమే లాక్‌డౌన్‌ను పరిమితం చేస్తే సరిపోతుందనేది సీఎం జగన్ చేసిన ప్రతిపాదన.

 

కేంద్రం కూడా ఇదే తరహా లాక్‌డౌన్ స్ట్రాటజీని అమలు చేసే ఆలోచనలో ఉంది. దేశాన్ని గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లుగా విభజించి.. వాటి ఆధారంగా లాక్‌డౌన్‌ను కొనసాగించే ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు సమాచారం. రెడ్ జోన్లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. ఇక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఆంక్షలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ఆరెంజ్‌ జోన్‌లో కరోనా ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. ఈ జోన్‌ పై కూడా ఫోకస్ పెడతారు. కరోనా ప్రభావం ఏమాత్రం లేని గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్‌ను సడలించి.. సాధారణ పరిస్థితులు కల్పిస్తారు. ఆర్ధిక వ్యవస్థతో ముడిపడి ఉన్న రంగాలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించడం కూడా ఇందులో భాగమే. 

 

కరోనాను కట్టడి చేయాలంటే రానున్న నాలుగు వారాలు చాలా కీలకం. అంటే నెల రోజుల పాటు కేంద్ర రాష్ట్రాలు అనుసరించే వ్యూహాలను బట్టే... దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేశం మొత్తాన్ని ఇంటికే పరిమితం చేసి ఎక్కడి వ్యవస్థను అక్కడి స్తంభింపచేస్తే పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. అందుకే దశల వారీ విధానాన్ని అవలంబించబోతున్నారు. కేరళ కూడా ఇదే ప్రతిపాదన చేసింది.  కరోనా తీవ్రతను జిల్లాల వారీగా సమీక్షించుకుని పరిస్థితులను బట్టి...ఆంక్షల కొనసాగింపు, తొలగింపు నిర్ణయాలు ఉండాలన్నది కేరళ వ్యూహం. లాక్‌డౌన్‌ను ఏఏ రంగాలపై కొనసాగించాలని...ఎక్కడెక్కడ తొలగించాలనే దానిపై బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్న కేంద్రం కనీసం రెండు వారాలు లాక్‌డౌన్ కొనసాగించేందుకు ప్రాధమికంగా అంగీకరించింది. ప్రజల జీవితాలతో పాటు ఆర్ధిక వ్యవస్థను కాపాడేలా కరోనా విషయంలో కొత్త గైడ్‌లైన్స్‌ను త్వరలోనే కేంద్రం ప్రకటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: