దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ అమలవుతోంది. ఈ సమయంలో నిత్యావసరాలతో పాటు ఇతర ఏ వస్తువుల ధరలూ పెంచొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. అయినా  ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యాపారుల వైఖరిలో ఏ మాత్రం మార్పురావడం లేదు. లాక్‌డౌన్‌ను అవకాశంగా తీసుకొని కొందరు రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. కరోనా వ్యాపించకముందున్న ధరలకు, లాక్‌డౌన్‌లో వ్యాపారులు వసూలు చేస్తున్న ధరలకు అసలు పొంతన ఉండడం లేదు. 

 

ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అదనుగా చేసుకుని కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ధరలు నియంత్రణలో ఉంచడానికి ధరల పట్టిక పెట్టమని ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ దానిని పట్టించుకోకుండా వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వినియోగదారులకు ఇష్టముంటే కొనుక్కోండి లేదంటే వెళ్లిపోండని దురుసుగా సమాధానమిస్తున్నారు. 

 

అధిక రేట్లపై కొంచెం గట్టిగా నిలదీసే వినియోగదారుల నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు తెలివిగా అబద్ధాలు చెబుతున్నారు. ధరల పట్టికకు, తీసుకున్న ధరలకు ఇంత వ్యత్యాసమేంటని వినియోగదారులు అడిగితే పట్టిక మీద రేట్లు సెకండ్‌ క్వాలిటీకి సంబంధించినవని, తాము వసూలు చేస్తున్న ధరలు ఫస్ట్‌ క్వాలిటీకి సంబంధించినవని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ రేట్లు చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అసలే కరోనా ప్రభావంతో చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తోంటే...వ్యాపారులు వసూలు చేస్తున్న రెట్టింపు ధరలు పెను భారాన్ని మోపుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వ్యాపారులు నిత్యావసరాల కృతిమ కొరతా సృష్టిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే సరుకు రావడం లేదని, వచ్చే రోజుల్లో ఇవి కూడా దొరకవని భయపెడుతూ తాము చెప్పే ధరలకే నిత్యావసరాలు కొనే పరిస్థితి కల్పిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక ధరలకు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు. మొత్తానికి కరోనా దెబ్బకు లాకౌడౌన్ విధించడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: