మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన లాక్ డౌన్ గడువు ముగియనుంది. కేంద్రం కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించింది. దేశంలో ఏప్రిల్ 14లోపు కరోనాను నియంత్రించవచ్చని కేంద్రం భావించినా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దీంతో మోదీ ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించనున్నారని ప్రచారం జరుగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు నమోదవుతూ ఉండటం... మరోవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థల వల్ల మోదీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. 
 
ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రానికి సూచనలు చేశాయి. కేంద్రం కుడా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించడానికి సుముఖంగానే ఉందని సమాచారం. అయితే అధికారికంగా కేంద్రం ఎప్పటివరకు లాక్ డౌన్ ను పొడిగిస్తుందో ప్రకటన చేయాల్సి ఉంటుంది. లాక్ డౌన్ అమలు వల్లే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ప్రధాని ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ గురించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. 
 
లాక్ డౌన్ వల్ల ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం దారుణంగా పడిపోయింది. అందువల్ల మోదీ ఈసారి స్మార్ట్ లాక్ డౌన్ ను ప్రకటించవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించి.... తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలలో పాక్షికంగా లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. 
 
దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి జోన్లను బట్టి కేంద్రం ఆంక్షలు అమలు చేయనుందని సమాచారం. కేంద్రం వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు ఆంక్షలు సడలించనుందని తెలుస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది. మాల్స్, థియేటర్లు, పాఠశాలలకు కేంద్రం అనుమతివ్వకపోవచ్చని సమాచారం. విమాన ప్రయాణాలకు, ప్రత్యేక రైళ్ల రాకపోకలకు కేంద్రం అనుమతివ్వనుందని తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: