ఏపీ సీఎం జగన్ సంగతి అందరికీ తెలిసిందే. ఏదైనా పట్టుపట్టాడంటే ముందూ వెనుకా ఆలోచించడు.. పని జరిగిపోవాల్సిందే. ఎవరు ఏమనుకుంటారో అన్న వెరపు లేదు. తాను నమ్మింది చేసేయడమే.. అది మంచో చెడో తరువాత చూసుకోవచ్చు అనే టైపు. మొన్నటికి మొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ను ఆ పదవి నుంచి పీకే విషయంలోనూ అదే చేశాడు జగన్.

 

 

రాజ్యాంగబద్దమైన పదవి కాబట్టి.. ఏం చేసే అవకాశం లేదని మొదట్లో పంటి బిగువున ఊరుకున్నా.. ఆ తర్వాత న్యాయ కోవిదులతో సమాలోచనలు జరిపి ఓ లా పాయింటు దొరకబుచ్చుకున్నారు. నేరుగా పీకేయలేకపోయినా.. పదవీకాలం తగ్గించొచ్చు అన్న పాయింట్‌తో రమేశ్ కుమార్ కు షాక్ ఇచ్చారు. రాష్ట ఎన్నికల కమిషనర్ పదవీ కాలం మూడేళ్లకు తగ్గించేసి.. నీ టైమ్ అయిపోయంది ఇంటికి పో.. అని సాగనంపేశారు.

 

 

దీనిపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో విరుచుకుపడ్డారు. ఆయన ఏం రాశారో చూడండి.. “ సభ్య సమాజం నివ్వెరపోయే నిర్ణయాలు తీసుకోవడం ఒక్క జగన్మోహన్‌రెడ్డికే సాధ్యం! రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంఘాలలో నియమితులైన వారిని తొలగించడానికై జగన్‌ అండ్‌ కో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా తిక్కరేగి దేశంలో ముఖ్యమంత్రుల పదవీకాలాన్ని రెండేళ్లకో, మూడేళ్లకో కుదిస్తూ రాజ్యాంగ సవరణకు పూనుకుంటే జగన్‌ సమర్థిస్తారా? ఇంతకాలంగా జగన్‌ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను సమర్థిస్తున్న ఆయన మద్దతుదారులు ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమర్థించగలరా? అని ఆర్కే ప్రశ్నించారు.

 

 

మరి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పదవీ కాలం తగ్గిస్తారని కాదు.. కానీ.. అలా చేస్తే బాగు అన్న అంతర్గతమైన కోరిన ఈ రాతల్లో కనిపిస్తోంది. ఏదేమైనా జగన్ తీసుకున్న నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడాలి. ఆ విషయం చూసేందుకు ఎలాగూ కోర్టులు ఉన్నాయి కదా.. చూద్దాం.. ఏం జరుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: