లాక్ డౌన్ ను ఈ నెల 14 వ తేదీతో ఎత్తివేస్తారా లేదా అనే విషయంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడం, రోజు రోజుకి దీని ప్రభావం పెరిగిపోతుండడంతో మరికొంతకాలం ఈ నిబంధన పొడిగించాలి అంటూ సూచనలు అందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పోల్చి చూస్తే భారత్ లో పరిస్థితి కాస్త అదుపులోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, చాల రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన కఠినంగా అమలు చేస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోవడంతో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

 

IHG


 ప్రభుత్వాలకు కూడా మొత్తం ఆదాయం పడిపోయింది. అయినా మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ సూచిస్తున్నాయి. అదే కోవలో ఏపీ సీఎం జగన్ కూడా లాక్ డౌన్ ఎత్తివేయాలని కోరడంతో పాటు కొన్ని సూచనలను సైతం ప్రధానికి చేయడం, దానిని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని కొత్తగా లాక్ డౌన్ విషయంలో ప్రధాని స్పందించాలని చుస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను విధించకుండా, జోన్ల వారీగా విధించాలని, జోన్ల వారీగా లాక్ డౌన్ ను అమలు చేస్తే నే బాగుంటుందని, దానిని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుందో జగన్ సూచించారు. 


జగన్ సూచనలను ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న మోదీ జోన్ల వారీగా విభజించి లాక్ డౌన్ నిబంధనను అమలుచేస్తే మంచిది అన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా విభజించి మూడు విధాలుగా లాక్ డౌన్ ను అమలు చేయాలనే అభిప్రాయానికి ప్రధాని వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 400 జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ జిల్లాలను గ్రీన్ జోన్ కింద పరిగణించాలని చూస్తున్నారు. ఏపీలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆరెంజ్ జోన్ కింద 15 కంటే తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తిస్తారు. 


ఇక్కడ కనుక కేసుల సంఖ్య పెరగకపోతే, ఈ ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతిస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వ్యవసాయ పనులు చేసుకునేందుకు అనుమతిని ఇస్తారు.15 కేసులు కంటే ఎక్కువగా నమోదయిన ప్రాంతాలను రెడ్ జోన్  కిందకు తీసుకు వస్తారు. ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వరు. ఏప్రిల్ 14వ తేదీ తో 21 రోజుల లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. దీంతో ఈ రోజు కానీ, రేపు గాని కేంద్రం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: