దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ గురించి చర్చ జరుగుతోంది. రేపటితో లాక్ డౌన్ గడువు ముగియనుండడంతో ప్రజలంతా మోదీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించడంతో పాటు లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా లాక్ డౌన్ ను పొడిగించటానికే సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్రం ఈసారి స్మార్ట్ లాక్ డౌన్ ను ప్రకటించనుందని తెలుస్తోంది. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వేరు వేరు నిబంధనలను అమలు చేయనుందని తెలుస్తోంది. 
 
ప్రతి రాష్ట్రంలో నమోదైన కేసులకు బట్టి జిల్లాల వారీగా కేంద్రం మూడు జోన్లుగా విభజించనుంది. స్మార్ట్ లాక్ డౌన్ లో కేంద్రం జీవనోపాధి, ప్రజారోగ్యం రెండింటినీ సమన్వయం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజారోగ్యం కాపాడుతూ పరిశ్రమలు తెరిచేలా.... రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. పరిశ్రమలలో కార్మికులు సామాజిక దూరం పాటిస్తూ పని చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సమాచారం. 
 
కరోనా ప్రభావం ఉన్న జిల్లాలలో ఒక రకమైన నిబంధనలు, కరోనా ప్రభావం లేని జిల్లాలలో మరో రకం నిబంధనలు అమలు కానున్నాయి. మెట్రో నగరాల్లో మాత్రం లాక్ డౌన్ యథావిథిగా కొనసాగనుందని తెలుస్తోంది. కేంద్రం రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ లుగా ప్రకటించనుందని ప్రచారం జరుగుతోంది. రెడ్ జోన్లలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యేలా ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. ఆరెంజ్‌ జోన్‌లో సాధారణ లాక్‌డౌన్, గ్రీన్‌ జోన్‌లో సాధారణ జనజీవనం కొనసాగేలా కేంద్రం చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: