దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధాని మోదీ ఈరోజు లాక్ డౌన్ పొడిగింపు గురించి కీలక ప్రకటన చేయనున్నారు. మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించనున్నారని తెలుస్తోంది. రెండో దశ లాక్ డౌన్ లో కేంద్రం వ్యాపారులకు, కొన్ని వర్గాలకు శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. వీరికి కేంద్రం షరతులతో కూడిన సడలింపులు ఇవ్వనుందని సమాచారం. 
 
కేంద్రం ఎలక్ట్రీషియన్స్ కు, కార్పెంటర్స్ కు, లైసెన్స్ కలిగిన ప్లంబర్స్ కు మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది. ఆటో మొబైల్ వర్క్ షాప్స్ కు, మొబైల్ షాప్స్ కు వారంలో ఒకరోజు అనుమతి ఇవ్వనున్నారని సమాచారం. అయితే కేంద్రం వీరికి సామాజిక దూరం పాటించాలని షరతును విధించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం రెండో దశ లాక్ డౌన్ లో కొన్ని ఆంక్షల ఎత్తివేతకు, మినహాయింపులకు సిద్ధమవుతోంది. 
 
 
ఈరోజు ఉదయం కేంద్రం గూడ్స్ లారీల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. దేశంలో గూడ్స్ వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎటువంటి పాసులు లేకుండా ప్రయాణం చేసేలా ప్రభుత్వం ఆంక్షలలో మార్పులు చేసింది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నుంచి ఈరోజు ఉదయం దీనికి సంబంధించిన ఉత్తర్వులు పలు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులకు అందాయి. 
 
కేంద్రం అనుమతులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా లారీలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి జాతీయ రహదారులపై లారీలు తిరుగుతున్నాయి. ఎటువంటి పాసులు లేకుండానే గూడ్స్ వాహనాలను అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గూడ్స్ వాహనాలను అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేంద్రం ఇతర వాహనాలపై కూడా ఆంక్షలు ఎత్తివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర వాహనాల రాకపోకల గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: