ఈ రంగం... ఆ రంగం అని లేదు.. అన్నిరంగాలూ లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లోనే ఉన్నాయి. బ్యాంకులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు నిచ్చినా.. ఆ రంగం కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఆర్ధిక వనరులు సమకూర్చే అన్నీ వ్యవస్ధలు ఢీలా పడిపోవటంతో... బ్యాంకింగ్ రంగం మీద కూడా ఆ ప్రభావం పడింది.  బ్యాంకులకు అప్పు పడిన కంపనీలు ఇప్పుడు మరింత డీలా పడ్డాయి. 

 

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్ డౌన్  ఉపయోగకరంగా ఉంది. కానీ దేశ ఆర్ధిక వ్యవస్ధ మీద ఇది భారీ ప్రభావం చూపుతోంది. అన్నింటికన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని.. లాక్‌ డౌన్ ని ప్రకటించిన మొదటి రోజే ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అయితే రెండు వారాల లాక్ డౌన్ తరువాత... ప్రజల ప్రాణాలతో పాటు ఆర్ధిక వ్యవస్ధనూ కాపాడుకోవాల్సిన భాద్యత మనమీద ఉందని గుర్తు చేశారు మోడీ. దీంతో, లాక్‌డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ.. దీనివల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధ మీద మాత్రం భారం పడుతోంది. నెల రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగించటంతో... భారతదేశంలో కేవలం 2 శాతం వృద్దే నమోదవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. గడిచిన పదేళ్లలో ఇంత పతనం చూడలేదనేది వారి విశ్లేషణ.

 

దేశ వ్యాప్తంగా బ్యాంకులు.. బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన అప్పులతో ఆర్ధికంగా దెబ్బతిన్నాయి.  ఆ అప్పుల నుంచి ఇంకా బ్యాంకులు కొలుకునే పరిస్ధితికి రాలేదు. దీంతో కొత్తగా పరిశ్రమలకు అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పరిస్ధితి కనిపించటం లేదు. దేశంలో ప్రైవేటు పెట్టుబడుల రంగం దెబ్బతినడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్ధితిలో... పరిశ్రమలు ఆర్ధికంగా మరింత దిగజారే పరిస్ధితి నెలకొంది. దీంతో బ్యాంకుల వద్ద నాన్ పర్ఫార్మింగ్ కంపనీల సంఖ్య కూడా పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈవిధంగా బ్యాంకుల దగ్గరకి నిరర్ధక ఆస్తులు వచ్చి చేరబోతున్నాయి.

 

పరిశ్రమలకు రుణాలు ఇచ్చేదాని కంటే.. రిటైల్ రుణాలు ఇవ్వటం మేలన్న అభిప్రాయానికి వచ్చేశాయి బ్యాంకులు. అందుకే పరిశ్రమలకు ఇచ్చే రుణాలు తగ్గించిన బ్యాంకులు... వ్యక్తిగత రుణాలు ఇవ్వటాన్ని పెంచాయి. వీటి సంఖ్య 28 శాతానికి పెరిగాయని లెక్కలు బెబుతున్నాయి. 2014 నుంచి ఈ రుణాలను పరిశీలిస్తే... అంచెలంచలుగా పెరుగుతూ వచ్చాయి. 2014 లో వ్యక్తిగత రుణాల శాతం కేవలం 15గానే ఉండగా.. ఇప్పుడది 30 శాతానికి చేరింది. క్రెడిట్ బ్యూరో సిబిల్ కూడా... వ్యక్తి గత రుణాలే మేలని తేల్చింది. డీపాల్టర్ ల సంఖ్య కూడా కేవలం 0.5 శాతంగానే గుర్తించింది. కానీ ఇప్పుడు ఈ రిటైల్ రుణాల్లో కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. ఉద్యోగులకు చాలా కంపనీలు.. వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమయ్యాయి. లాక్ డౌన్ తో మూతపడ్డ కొన్ని కంపెనీలు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో  వేతనజీవులు ఈఎంఐ లు కట్టే పరిస్ధితి లేదు. దీనికి తోడు.. ఆర్బీఐ కూడా 3నెలల మారటోరియం విధించటంతో... బ్యాంకులకు ఈఎంఐలతో వచ్చే డబ్బులు కూడా 60 శాతానికి పైగా తగ్గిపోయాయి. దీంతో అటు పరిశ్రమల నుంచి వచ్చే డబ్బులు...ఇటు రిటైల్ రుణాల నుంచి వచ్చే డబ్బులు కూడా ఆగిపోవటంతో బ్యాంకులు కూడా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు.

 

అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే బ్యాంకింగ్ రంగం అంతంత మాత్రంగా సాగేది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా బ్యాంకింగ్ రంగం నమ్ముకున్న రిటైల్ రుణాల నుంచి కూడా ఆశించినంతగా డబ్బులు వచ్చే అవకాశాలు లేవు. దీంతో బ్యాంకులకు తిప్పలు తప్పేలా లేవు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: