దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడం వల్ల బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది.  ప్రపంచంలోని  దేశాలన్నీ కరోనా పేరు వింటే చాలు గజగజా వణికిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశం లేదని స్పష్టం చేసింది. 
 
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ముప్పు తప్పదని పేర్కొంది. కరోనా కొంతకాలం తర్వాత తగ్గినట్లు అనిపించినా మరలా వైరస్ విజృంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ దేశాలు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 19 లక్షల మంది కరోనా భారీన పడ్డారు. మృతుల సంఖ్య లక్ష దాటింది. 
 
డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తిస్తూ వెంటనే ఐసోలేట్ చేసే పద్ధతి కొనసాగించాలని సూచించారు. అమెరికా కొన్ని రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుందని అంచనా వేయగా దేవిడ్ వ్యాఖ్యలు అగ్ర రాజ్యం ఆశలపై నీళ్లు చల్లారు. వైరస్ కు మందు కనుక్కునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 9000 దాటింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఈరోజు వరకు 432 కేసులు నమోదు కాగా తెలంగాణలో 531 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం చర్యలు చేపడుతున్నా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.              

మరింత సమాచారం తెలుసుకోండి: