మీడియా అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం అంటారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వహాక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మూడు స్థంభాలైతే... ప్రజల తరపున గళమెత్తే మీడియాను నాలుగో స్థంభంగా వర్ణిస్తారు. గొంతులేని జనం గొంతుకై నిలిచేది మీడియా.. ప్రజా సమస్యలను వెలికి లోకి తీసుకొచ్చి వాటిని వివరించి పాలకుల్లో కదలిక తెచ్చే బృహత్తర బాధ్యత మీడియాపై ఉంది.

 

 

అందుకే మీడియా అంటే ఇంకా సమాజంలో కాస్తో కూస్తో గౌరవం మిగిలే ఉంది. అయితే రోజూ మీడియా ఎన్నో నీతులు చెబుతుంది. అసలు చట్టం ఏం చెబుతోంది.. ఆ చట్టాన్ని ఎవరు ఎలా ఉల్లంఘిస్తున్నారో కథలు కథలుగా రాస్తుంది. అయితే అలా కథలు కథలుగా వివరిస్తూ అక్రమార్కుల భరతం పట్టే మీడియాలోనే బాధితులూ ఉన్నారు. ప్రజల బాధలను కళ్లకు కట్టే ఈ రాత గాళ్లు తమ కష్టాలపై మాత్రం ఎవరికీ చెప్పుకోలేరు.

 

 

రోజూ నీతులు చెప్పే మీడియా పెద్దలు... తమ వద్ద పని చేసే జర్నలిస్టుల విషయంలో మాత్రం అనేక అక్రమాలకు పాల్పడతారు. అవేంటో చూద్దాం.. ఎవరైనా ఏదైనా పత్రికలో పని చేస్తే ఆ ఉద్యోగిని ఆ సంస్థ పేరుతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. కానీ చాలా మీడియా సంస్థలు కొన్ని ఏజెన్సీల పేరుతో నియామకాలు జరుపుతాయి. అంటే ఆ విలేఖరి ఆ పత్రికలోనే పని చేస్తాడు. ఆ పత్రిక ప్రతినిధిగానే జనంలో తిరుగుతాడు. కానీ అతడు ఆ పత్రిక ఉద్యోగి కాడన్నమాట.

 

 

ఇలా ఎందుకు అంటారా.. అతడిని సదరు పత్రిక సంస్థ తమ ఉద్యోగిగా గుర్తిస్తే అతనికి కార్మిక చట్టాల ప్రకారం కొన్ని ప్రయోజనాలు కల్పించాలి. అలవెన్సులు, బోనస్‌లు వంటి సౌకర్యాలు ఇవ్వాలి. నిబంధనలు పాటించాలి. తొలగిస్తే కారణం చెప్పాలి. ఇలాంటి భద్రత ఉంటుంది. అందుకే మీడియా సంస్థలు తమ విలేఖరులను ఏజెన్సీల పేరుతో తీసుకుంటారు. అవసరం లేదనుకుంటే.. తక్షణమే తొలగిస్తారు. ఇదీ మీడియా పెద్దల ముసుగు మోసం.

మరింత సమాచారం తెలుసుకోండి: