చైనాలో మళ్లీ కరోనా కలకలం. ఈ వైరస్‌ తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ఆ దేశంలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పాజిటివ్‌ రోగుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ చైనాలో ఏం జరుగుతోంది?

 

ప్రపంచమంతా కరోనాతో గగ్గోలు పెడుతున్న సమయంలో ఈ వైరస్‌ పుట్టిన చైనాలో మాత్రం పరిస్థితి అదుపులోకి రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. చైనా తీసుకున్న కఠిన నిర్ణయాలు.. సకాలంలో స్పందించి చేపట్టిన చికిత్సల కారణంగా మహమ్మారి కట్టడి అయినట్లు భావించారు. 76 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత వుహాన్‌ ఊపిరి పీల్చుకుంది. జనం రోడ్లపైకి వచ్చారు. ఆ పీడకల నుంచి ఇప్పటికిప్పుడు కాకపోయినా... జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని అనుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని, సామాజిక దూరం పాటిస్తూ గడపదాటి  బయట కాలు పెట్టారు. నాలుగు నెలలపాటు కరోనా ఊచకోతకు 3 వేల 341 మంది చనిపోవడంతో ఆ బాధను  దిగమింగుకుంటూనే కొత్త జీవనయానం ప్రారంభించారు. కానీ.. ఈ సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. చైనాలో రెండోదఫా కరోనా విజృంభణ మొదలైంది. 

 


వైరస్‌ పీక్‌లో ఉన్న సమయంలో మార్చి 5న చైనాలో ఒకే రోజున 143 పాజిటివ్‌ రోగులు నమోదైతే.. ఆ తర్వాత మళ్లీ  ఒకే రోజులో 108 కేసులు వెలుగు చూశాయి. ఆదివారం ఒక్కరోజే వందకు పైగా కరోనా బాధితులు  వెలుగులోకి రావడంతో చైనాలో కలకలం మొదలైంది. శనివారం ఈ సంఖ్య 99గా ఉంది. దీంతో ఈ మహమ్మారి రెండోసారి దాడి చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దాదాపు ఆరు వారాల తర్వత పరిస్థితి మళ్లీ విషమంగా మారుతుండటంతో అధికారవర్గాల్లోనూ అలజడి మొదలైంది. అయితే కొత్తగా గుర్తించిన కరోనా పాజిటివ్‌ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలోనే నమోదయ్యాయి. దీంతో చైనాలో ఇప్పటి వరకూ ఈ వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 82వేలు దాటేసింది. కేవలం శని, ఆదివారమే కాకుండా దాని ముందు కూడా రోజుకు  50 నుంచి 60 మంది వరకూ పాజటివ్‌ రోగులు  నమోదవుతు వచ్చారు. ఇప్పుడా సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 

 


వాస్తవానికి మార్చి 12 తర్వతా చైనాలో ఈ వైరస్‌ ప్రభావం తగ్గుతూ రాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎవ్వరి ఊహకు అందని విధంగా దాడి చేసింది. ప్రపంచం గగ్గోలు పెడుతుంటే.. చైనా మాత్రం వైరస్‌ నియంత్రణలో సక్సెస్‌ అయ్యిందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వారిలో వైరస్‌ లక్షణాలు ఉండటం.. పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలుతుండటంతో అంతా అప్రమత్తం అయ్యారు. చైనా ఈశాన్య ప్రాంతంలోని హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో పరిస్థితి క్రమంగా విషమంగా మారుతోంది. 

 

హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ రష్యా సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ కొత్తంగా 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 49 మంది రష్యా  నుంచి వచ్చిన వారే. దీంతో రష్యా, చైనా సరిహద్దుల్లో స్క్రీనింగ్‌ను ముమ్మరం చేసింది డ్రాగన్‌ కంట్రీ. రష్యా నుంచి  వచ్చే వారిని.. తప్పనిసరిగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. సరిహద్దుల్లోని సుఫెన్హీ, హర్బిన్‌ నగరాల్లోకి రష్యా నుంచి ఎవరొచ్చినా దాదాపు 28 రోజులపాటు క్వారంటైన్‌కు పంపుతున్నారు. వీరికి అన్ని రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హర్బిన్‌ నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. 14 రోజులపాటు ప్రజలెవ్వరూ రోడ్లపైకి రాకుండా చైనా అధికారులు ఆంక్షలు విధించారు. 

 


చైనాలో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వివిధ దేశాల్లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అక్కడి పాలకులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా అగ్రరాజ్యాలతోపాటు వివిధ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటంతో అలాంటి ప్రాంతాల నుంచి తమ వారిని తరలిస్తోంది. ఇలా వస్తున్న వారిలోనే ఎక్కువా పాజిటివ్‌ బాధితులు బయటపడుతున్నారు.  ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారిలో 1300 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో దాదాపు 500 మందికి  నయం కాగా..మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.  వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు చైనా అధికారులు. 

 


ఒక్క చైనానే కాదు.. వైరస్‌ కట్టడిలో చాలా వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న దక్షిణ కొరియాలోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వైరస్‌ సోకి.. చికిత్స తర్వాత కోలుకున్న 91 మందిలో తిరిగి పాజిటివ్‌ రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వైరస్‌ చికిత్సకు లొంగుతున్నట్లు కనిపించినా.. అది శరీరంలో నిద్రాణమై ఉంటోందని వైద్యులు అనుమానిస్తున్నారు. తర్వాత కాలంలో ఆ వైరస్‌ మళ్లీ చైతన్యమై మరోసారి దాడి చేస్తున్నట్లు గుర్తించారు. పైగా రెండోసారి వైరస్‌ సోకితే ఆ లక్షణాలు కనిపించడం లేదు. పరీక్షలు చేస్తేగానీ బాధితులకు కరోనా ఉన్నట్లు తెలియడం లేదు. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నారు కదా అని లైట్‌ తీసుకుంటే.. ఈలోగా సదరు వ్యక్తి నుంచి వైరస్‌ వ్యాప్తి విస్తృతం అవుతోంది. అందుకే  వైద్య నిపుణులకు అంతు చిక్కడం లేదు. 

 

అటు చైనా.. ఇటు దక్షిణ కొరియాలో చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ప్రపంచ దేశాలను ఇంకా కలవరపరుస్తున్నాయి. కరోనా ఎప్పటికి దారికొస్తుందో తెలియక తీవ్రంగా మదనపడుతున్నారు. చికిత్స తర్వాత కోలుకున్న బాధితులపై ఒక కన్నేసి ఉంచాలని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: