దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఏడున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు . గతనెల 25 వతేదీ నుంచి ఈ నెల 14 వతేదీ వరకు దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగనున్న విషయం తెల్సిందే . 21  రోజుల పాటు కొనసాగనున్న లాక్ డౌన్ వల్ల రవాణారంగం పై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు .

 

లాక్ డౌన్ కారణంగా  లారీలు ఎక్కడిక్కడే నిలిచిపోవడం వల్ల దాదాపు 35 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని అంటున్నారు . ఒకొక్క లారీ రోజుకు సగటున 2 , 200  రూపాయలు నష్టం వాటిల్లనుందని ఆలిండియా ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులు వెల్లడించారు . రవాణారంగం తోపాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుందని చెప్పారు . లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు , అమ్మకాలు నిలిచిపోవడం వల్ల స్థిరాస్తి రంగానికి లక్ష కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు .

 

రిటైల్ వాణిజ్యం కూడా కనీవినీ ఎరుగని  స్థాయిలో క్షిణించిందని  , మార్చి రెండవ వారం లో దాదాపు 2 .2 లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లే అవకాశముందని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు . భారత్ లో రిటైల్ అమ్మకాల రంగం లో ఏడు కోట్ల చిన్న , మధ్య తరగతి వ్యాపారులుండగా , దాదాపు 45 కోట్ల మంది వారివద్ద పని చేస్తుంటారని చెబుతున్నారు . దేశం లో రిటైల్ వ్యాపారమే  ఆరున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు కొనసాగుతుందని వెల్లడించారు . లాక్ డౌన్ అనంతరం కేంద్రం తీసుకునే చర్యల పైనే  దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జివన పరిస్థితి  ఆధారపడి ఉండనుందని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: