కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 21 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు, అంటే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించేసాయి. వీలుని బట్టి జోన్ల వారీగా లాక్ డౌన్ పెట్టే అవకాశముంది.

 

అయితే లాక్ డౌన్ దెబ్బకు మందుబాబులు విలవిలాడిపోతున్నారు. బార్లు, వైన్స్ అన్ని క్లోజ్ కావడంతో మందుబాబులకు పిచ్చిలేస్తోంది. వైన్స్, బార్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారని ఆవురావురమంటూ చూస్తున్నారు. 21 రోజులు లాక్ డౌన్ అయిపోయింది, కాబట్టి ఇబ్బంది లేదనుకున్నారు. కానీ మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు మందుబాబులకు షాక్ తగిలేలా చేసింది.

 

ఈ క్రమంలోనే మందుబాబుల దాహం తీరే అవకాశం ఒకటి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఆల్కహాల్ అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వాలని లిక్కర్ బాడీ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్(సీఐఏబీసీ) కోరింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అలాగే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దశలవారీగా పబ్బులు, రెస్టారెంట్లు తెరవడానికి కూడా అనుమతులివ్వాలని సూచించింది.

 

అయితే దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో అని మందుబాబులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పైగా ఎక్కువ ఆదాయం వచ్చే వాటిల్లో మద్యం కూడా ఒకటి కాబట్టి, ఆన్ లైన్ మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇస్తారని చూస్తున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే షరతులతో కూడిన ఆన్ లైన్ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్మిషన్ ఇస్తే బాగుంటుందని, ఇక్కడి మందుబాబులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

కాకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ మద్యం అమ్మకాలు ఉండవని ఇప్పటికే తేల్చిచెప్పేశారు. అటు ఏపీలో కూడా మద్యం అమ్మకాల పట్ల జగన్ ప్రభుత్వం ఆసక్తిగా లేదు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ మద్యం అమ్మకాలకు సీఐఏబీసీ కేంద్రాన్ని, రాష్ట్రాలని పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఏమైనా మార్పులు జరగొచ్చని మద్యం ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: