లాక్‌డౌన్ వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనేక రంగాల‌పై ప‌డుతున్న ప్ర‌భావాన్ని వివ‌రిస్తూ ప్ర‌ధాని మోడీకి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ లేఖ రాశారు. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయం, దాని ఆధారిత రంగాల కార్య‌క‌లాపాలు కొన‌సాగించేలా తీసుకోవాల్సిన చ‌ర్య‌లను అందులో ప్ర‌స్తావించారు. నిజానికి.. ఈ నెల 11న నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే మోడీ దృష్టికి ప‌లు అంశాల‌ను జ‌గ‌న్ తీసుకెళ్లారు. అయితే.. లాక్‌డౌన్ పొడిగింపుపై మంగ‌ళ‌వారం ఉద‌యం  ప్ర‌ధాని ప్ర‌సంగించ‌నున్న నేప‌థ్యంలో సోమ‌వారం రాత్రి జ‌గ‌న్ లేఖ రాశారు. అయితే.. ఈ లేఖ‌లోని అంశాల‌ను ప్ర‌ధాని ఏమేర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్నే. అయితే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాసిన లేఖ‌లోని అంశాలు మాత్రం ఏపీ మ‌నుగ‌డ‌కు అత్యంత కీల‌క‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఏపీలో వ్య‌వ‌సాయం, దాని ఆధారిత రంగాలు ఎంత ముఖ్య‌మో జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. * ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయాధారిత రాష్ట్రం. రాష్ట్ర జీఎస్‌డీపీలో 34 శాతం వ్యవసాయరంగానిదే. 60 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ దాని అనుబంధ కార్యకలాపాల మీదే ఆధారపడి ఉంటున్నారు. 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతుండగా... అందులో 17 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు* అని లేఖ‌లో పేర్కొన్నారు. 

 

అంతేగాకుండా.. మిర్చి, అరటి, కొబ్బరి, టమోటా, వంగ, బొప్పాయి, ఆయిల్‌ పాం, పొగాకు, చేపలు,రొయ్యలు, ఫౌల్ట్రీ ఉత్పత్తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌దే అగ్ర‌స్థాన‌మ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. వరి, వేరుశెనగ, మొక్కజొన్న, మామిడి, మాంసం ఉత్పత్తిలో రెండో స్థానంలో, పాల ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్ధానంలో ఉన్నామ‌ని పేర్కొన్నారు.  అలాగే..ఏపీలో పెద్ద సంఖ్యలో పండ్లను ఉత్పత్తి చేస్తున్నామ‌ని.. ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు  కూడా ఏపీ నుంచి ఎగుమతులు చేస్తున్నామ‌ని లేఖ‌లో ప్ర‌స్తావించారు. అయితే.. లాక్‌డౌన్‌ కారణంగా ర‌వాణాకు తీవ్ర ఆటంకం ఏర్ప‌డింద‌ని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులు మార్కెటింగ్, రవాణాకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయ‌న్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో 50 శాతం మార్కెట్లు మాత్రమే  నిర్వహిస్తున్నా అందులో కార్యకలాపాలు 20–30శాతం మించి జరగడం లేదని తెలిపారు.  దీంతో అరటి, మొక్కజొన్న లాంటి పంటల మార్కెటింగ్‌కు అంతరాయం ఏర్పడింద‌ని, వ్యవసాయం, దాని ఆధారిత రంగాల మీద అత్యధికంగా ఆధారపడిన వారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయ‌ని వివ‌రించారు.

 

* అస్సాం, బెంగాల్, బీహార్, యూపీ రాష్ట్రాలలోని మార్కెట్‌లు లాక్‌డౌన్ వ‌ల్ల‌ మూతప‌డ్డాయి. నెల రోజులుగా ఏపీలో ఉన్న ఆక్వా ఉత్పత్తులు మార్కెటింగ్‌ కావడం లేదు. అమెరికా, యూరప్‌ దేశాల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ఎగుమతులు గణనీయంగా  పడిపోయాయి. అలాగేరవాణా కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 25  శాతం రవాణా మాత్రమే సాగుతోంది. వ్యవసాయం సహా పారిశ్రామిక ఉత్పత్తుల పంపిణీ సరఫరాల కోసం పూర్తిస్థాయిలో రవాణావ్యవస్థ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ, ఉద్యానవన, చేపలు, రొయ్యల మార్కెట్లలో కార్యకలాపాలు జరిగేలా చూడాలి* అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విన్న‌వించారు. అయితే.. ఈ లేఖ‌ను ప్ర‌ధాని మోడీ ఏమేర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏపీ స‌మ‌స్య‌ల‌నే అందులో పేర్కొన్నా.. అవి దాదాపుగా అన్ని రాష్ట్రాల‌కు వ‌ర్తిస్తాయ‌మ‌ని, ఆ దిశ‌గా మోడీ ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటే.. అది సీఎం జ‌గ‌న్ ఘ‌న‌త‌గానే చెప్పుకోవ‌చ్చున‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: