దేశమంతా లాక్‌డౌన్ అమల్లో ఉంది. నేటితో ముగియనున్న లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సిన వారి చాలా ఇబ్బందిపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని తాము ప్రయాణిస్తామంటున్నా.. వారికి అనుమతులు దొరకడం లేదు. అసలు బయటకు వస్తేనే పోలీసులు కుమ్మేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

 

 

ఇలాంటి సమయంలో వాస్తవంగా అత్యవసర పరిస్థితి ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇలాంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం ప్రజల అత్యవసర ప్రయాణాలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. లాక్ డౌన్ ను ప్రజలు పక్కాగా అమలు చేస్తున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే విపత్కర పరిస్థితిలో అత్యవసర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ప్రజలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. 

 

 

అత్యవసర పరిస్థితులు ఉన్నవారు.. అందులోనూ ప్రధానంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లేవారికి కాస్త వెసులు బాటు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకూ వీరు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇలాంటి వారికోసం కోవిడ్‌-19 అత్యవసర రవాణా పాసులు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

 

 

అయితే ఈ పాసులు కావాలనుకునేవారు.. 1. పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్‌ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్‌, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాధ్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీ చేస్తారు. అలాగని ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తే.. మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: