మొదటి నుంచి తెలుగు దేశం చానళ్లుగా పేరుబడిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానళ్లను సంఘ విద్రోహశక్తులుగా వైసీపీ ప్రకటించింది. ఈ రెండు చానళ్లు కావాలని ఏపీలో జగన్ సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. టీవీ5, ఏబీఎన్‌ రాధాకృష్ణ సంఘ విద్రోహ శక్తులని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపడ్డారు. జగన్ సర్కారుపై అన్యాయమైన రాతలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 

 

 

టీడీపీ మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కూడా జగన్ సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్నారని సుధాకర్‌బాబు విమర్శించారు. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే విమర్శలు చేయడం దారుణమని అన్నారు. దళితులు ఎన్నికల కమిషనర్‌గా ఉండకూడదా అని ఆయన అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి దళిత ద్రోహి అని తెలిపారు. ఏపీలో కరోనా కట్టడికి ఎపి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా  ఆ చానళ్లు మాత్రం దుష్ప్రచారం సాగిస్తున్నాయని సుధాకర్ బాబు అన్నారు. 

 

 

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తోందని సుధాకర్ బాబు వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరించారని సుధాకర్ బాబు విమర్శించారు. రాష్ట్రం ఓ వైపు విపత్కర పరిస్థితుల్లో ఉన్నా.. ఏమాత్రం పట్టకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని నీచ రాజకీయం చేస్తున్నారని సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

చంద్రబాబు వంటి రాజకీయ నాయకులకు, టీవీ5, ఏబీఎన్ రాధాకృష్ణ వంటి మీడియాలకు ప్రజలే బుద్ది చెబుతారని సుధాకర్ బాబు ఆవేశంగా అన్నారు. వీరికి ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టవి.. నిరంతరం అధికారం కోసం ఆలోచిస్తూ రాజకీయాలు చేస్తుంటారని సుధాకర్ బాబు దుయ్యబట్టారు. అయితే మొదటి నుంచి ఈ ఛానళ్లు జగన్ వ్యతిరేక వైఖరినే అవలంబిస్తున్నా.. ఇటీవలి కాలంలో ఈ ధోరణి ఇంకా పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: