దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 592కు చేరింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా భారీన పడి 17 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం గమనార్హం. 
 
హైదరాబాద్ లోనే కేసులు నమోదు కావడంతో సీఎం కేసీఆర్ నగరంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాల్లో కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు హైదరాబాద్ నగరంలో జోన్ల వారీగా విభజించనున్నారు. ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించనున్నారు. 
 
ఒక్కో జోన్ కు ప్రత్యేక అధికారిని నియమించి లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 
 
కేసీఆర్ ఇచ్చిన తాజా ఆదేశాల వల్ల కేసులు నమోదైన ప్రాంతాలలో ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రానీయరు. అత్యంత కఠినంగా కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు చేపడతారు. ప్రభుత్వ యంత్రాంగమే ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేస్తుంది. ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారులను నియమించనుందని సమాచారం. రాష్ట్రంలో హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలవ్వడం ఒక రకంగా నగర ప్రజలకు షాక్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: