కరోనా కొందరికి శాపంగా మారితే.. మరికొందరికి మాత్రం వరంగా మారింది.. ముఖ్యంగా నేరస్తులపాలిట కరోనా సహయకారిగా పనిచేస్తుంది.. ఇదిలా ఉండగా ఇప్పటికే కొన్ని జైళ్లలో ఉన్న నిందితులను అధికారులు వదిలేసారని విన్నాము.. ఇక ఈ కరోనా మరోసారి ఒక దొంగను కాపాడింది.. దీనికంతటికి కారణం అతన్ని కోర్టులో హాజరుపరిచే ముందు చేసిన వైద్య పరీక్షల్లో క్వారంటైన్‌ స్టాంప్‌ పడటమే ఈ నిందితుడికి కలిసివచ్చింది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్‌ మహేష్‌(19) తన 15వ ఏటనుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.. ఇప్పటి వరకు రాజధానితో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో 50కి పైగా నేరాలు చేశాడు. కాగా మూడు సంవత్సరాల క్రితం వనస్థలిపురం పోలీసులు మైనర్‌గా ఉన్న మహేష్‌ను పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా న్యాయమూర్తి ఈ నేరస్తుడికి మూడేళ్ల శిక్ష విధించడంతో గాజులరామారంలోని గవర్నమెంట్‌ స్పెషల్‌ హోమ్‌ ఫర్‌ బాయ్స్‌లో ఉంచగా ఇక్కడి అధికారులు ఇతనితో పాటుగా మరికొందరికి వృత్తి విద్యలో శిక్షణ తీసుకోవడంలో భాగంగా ఇతగాడిని గచ్చిబౌలిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో చేర్పించారు. రెండేళ్ల ఎనిమిది నెలల శిక్షకాలం పూర్తి చేసుకున్న మహేష్‌ గతనెల ఎన్‌ఏసీనుంచి పారిపోయాడు.

 

 

అయితే లాక్‌డౌన్‌కు వారం రోజుల ముందు ఇలా బయటపడ్ద మహేష్‌కు మైనార్టీ సైతం తీరింది. ఇలా తప్పించుకున్న ఈ నేరగాడు తిరిగి చోరీలు చేయడం మొదలుపెట్టాడు.. కాగా ఇతనిమీద నిఘా పెట్టిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి కంచన్‌బాగ్‌ పోలీసులకు అప్పగించారు. ఇతడి అరెస్టుకు సంబంధించిన ఫార్మాలిటీస్‌ పూర్తి చేసిన కంచన్‌బాగ్‌ అధికారులు ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్న సందర్భంలో మహేష్‌ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో అక్కడి వైద్యులు అతడి చేతిపై 14 రోజులకు క్వారంటైన్‌ ముద్ర వేశారు..

 

 

అనంతరం ఆ నిందితుడిని కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్ళగా అక్కడ ఇతని చేతిపై క్వారంటైన్‌ స్టాంపు చూసిన జైలు అధికారులు రిమాండ్‌కు తీసుకోవడానికి అంగీకరించలేదు. తిరిగి పోలీసులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా, ఈ నేరస్తుడి నుండి వ్యక్తిగత బాండ్‌ తీసుకుని హోం క్వారంటైన్‌కు తరలించ వలసిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆదివారం రాత్రి కంచన్‌బాగ్‌ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మహేష్‌ను చంటపల్లి తండాకు తీసుకువెళ్లి ఇంటి వద్ద క్వారంటైన్‌ చేసి వచ్చారు...  

మరింత సమాచారం తెలుసుకోండి: