ఇప్పుడంతా కోవిడ్ జ‌ప‌మే. ప‌ల్లె ప‌ట్నం అనే తేడా లేకుండా...అంతా ఈ వ్యాధి గురించే చ‌ర్చ‌, ఆందోళ‌న‌. అయితే, అదే స‌మ‌యంలో ఓ మిస్ట‌రీ సైతం ఉంది. అదే ఈ వ్యాధి పుట్టుక‌. చైనాలోని వుహాన్‌ నగరంలో వన్యప్రాణుల మాంసాన్ని విక్రయించే మార్కెట్‌ నుంచే వైరస్‌ వ్యాపించిందని, జీవాయుధం (బయోవార్‌ఫేర్‌) కోసం చైనానే ఈ వైరస్‌ను సృష్టించిందని, వుహాన్‌లో ఉన్న ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయిందని రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న‌ప్ప‌టికీ అధికారిక ప్ర‌క‌ట‌న‌లు ఎక్క‌డా లేవు. అయితే, తాజాగా ఊహించ‌ని ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. 

 

కరోనా వైరస్‌కి సంబంధించి మొదటి కేసును గ‌త ఏడాది డిసెంబరు 31న గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చైనా అధికారికంగా సమాచారం అందించింది. అయితే, ఆనాటి నుంచి చైనా అన్నీ డౌట్లు క‌లిగిస్తూనే ఉంది. వుహాన్‌ మార్కెట్‌ నుంచి కాకుండా, ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీక్‌ అయ్యిందనే అనుమానాలున్నాయి. ఎందుకంటే చైనా బుద్ధి మొద‌టి నుంచి అలాంటిదే. 1956లో చైనాలో ఉద్భవించిన ఏషియన్‌ ఫ్లూ చాలా దేశాలను అతలాకుతలం చేసింది. చైనాతో పాటు సింగపూర్‌, హాంకాంగ్‌, అమెరికాలో  20 లక్షల మందికి పైగా బలయ్యారు. 2013లో చైనాలో హెచ్‌7ఎన్‌9 గా పిలిచే తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. అనంతరం అది  బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, భారత్‌, ఇండొనేషియా, వియాత్నం దేశాలకు వ్యాప్తించింది. 2002లో వెలుగులోకి వచ్చిన సార్స్‌  కారణంగా 20కిపైగా దేశాల్లో 774 మంది మృత్యువాత పడ్డారు. 

 

ఇదే రీతిలో తాజాగా వుహాన్‌ మార్కెట్‌ నుంచి కాకుండా, ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీక్‌ అయ్యిందనే అనుమానాలున్నాయి. ల్యాబ్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు తొలుత వైరస్‌ సోకి ఉంటుందని, వారి నుంచి స్థానికులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. వుహాన్‌ మార్కెట్‌కు ఈ ల్యాబ్‌ కేవలం 20 మైళ్ల దూరంలోనే ఉన్నది. ల్యాబ్‌లో దాదాపు 1500 వైరస్‌లు ఉన్నట్లు అంచనా. చైనాలో వైరస్‌లు పుట్టడం, ప్రపంచ దేశాలకు వ్యాపించడం కొత్తేం కాదు కాబ‌ట్టి ఆ దేశంతో ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: