మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ పొడిగింపును సమర్థిస్తున్నట్లు ప్రకటన చేశారు. లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు కానీ ప్రజల ప్రాణాలు కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. కరోనా కంటికి కనిపించని భయంకరమైన శత్రువు అని అన్నారు. కరోనాతో అగ్ర రాజ్యాలు సైతం అతలాకుతలమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. 
 
నిన్న ప్రధానమంత్రి ఆఫీసుకు ఫోన్ చేసి ఆలోచనలన్నీ షేర్ చేసుకున్నానని తెలిపారు. ప్రధాని మోదీ కరోనా విషయంలో కరెక్ట్ గా వ్యవహరించారని అన్నారు. మోదీ ప్రతి ఒక్కరి సలహాలు,సూచనలు తీసుకుని కరోనా విషయంలో చర్యలు చేపట్టారని తెలిపారు. 60 సంవత్సరాల పై బడిన వారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతోందని... వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. 
 
ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్చంధంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మనం జాగ్రత్తగా ఉంటే మాత్రమే కరోనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఫ్లూ లక్షణాలు కనిపించిన వారందరికీ పరీక్షలు చేయించాలని సూచించారు. కరోనా వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సూచించారు. 
 
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ తానే సీఎం అయినట్లుగా ప్రజలకు సూచనలు చేయడం, కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు చెప్పడం చాలా బాగుంది. కానీ చంద్రబాబు అనేక డిమాండ్లను లేవనెత్తి ఏపీలో అద్భుతాలు జరగాలని ఆశిస్తునారు. రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. మరి చంద్రబాబు వ్యాఖ్యల పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.                      

మరింత సమాచారం తెలుసుకోండి: