లాక్‌డౌన్‌ తో వైన్‌ షాపులకు మూత పడింది. కానీ ఇదే అదనుగా సారా బట్టీలు మళ్లీ లేచాయి. మందుబాబుల ఆరాటంతో సారా వ్యాపారం అమాంతం పెరిగింది. లీటర్‌ 50 నుంచి వెయ్యి రూపాయలకు వరకు పెరిగిందంటే డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కర్నూలు జిల్లాలో మూడు ప్యాకెట్లు, ఆరు సీసాలుగా సాగుతోంది నాటుసారా వ్యాపారం. 

 

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ నాటుసారా వ్యాపారుల పంట పండిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ అమలు చేసి అన్ని రంగాల ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటే, నాటుసారా వ్యాపారులకు  మాత్రం కాసుల వర్షం కరుస్తోంది. ఎక్సైజ్ శాఖ ఎంత దాడులు చేసినా బట్టీల్లో సారా తయారీని మాత్రం  నియంత్రించలేకపోతున్నారు. సారా తయారీలో కీలకమైన బెల్లం అమ్మకాలపైనే ఆంక్షలు విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో స్పష్టమవుతుంది. 

 

మద్య నిషేధం దశల వారీగా అమలు ప్రారంభమైనప్పటి నుంచి కర్నూలు జిల్లాకు కర్నాటక, తెలంగాణా నుంచి విచ్ఛలవిడిగా అక్రమ మద్యం వస్తోంది. కర్నాటక, తెలంగాణా సరిహద్దు ఎక్కువగా ఉండడంతో ఈజీగా ఏపికి రవాణా చేస్తున్నారు. కర్నాటక సరిహద్దు 200 కి.మీ, తెలంగాణా సరిహద్దు 150 కి.మీ ఉంది. ఈనేపథ్యంలో నాటు సారా అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. 

 

ప్రభుత్వ రిటైల్ షాపుల్లో ధరలు పెంచడంతో పాటు, మద్యం కొరత కూడా తోడవటంతో నాటుసారాకు డిమాండ్ పెరిగింది. కర్నూలు జిల్లాలో 205 మద్యం షాపులు ఉండగా 164కు తగ్గించింది ప్రభుత్వం. దీంతో నాటుసారాకు మరింత డిమాండ్ పెరిగింది. ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎంత అదుపు చేసినా సిబ్బంది కొరత కారణంగా పూర్తి స్థాయిలో  సారాను నియంత్రించటంలో సఫలం కాలేకపోయారు. కరోనా వైరస్ తో  లాక్ డౌన్ మొదలయ్యాక సారాకు డిమాండ్ అమాంతం పెరిగింది. మద్యం షాపులు మూత పడటంతో మందుబాబులు నాటుసారాను ఆశ్రయిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో నాటుసారా విపరీతంగా తయారవుతోంది. గతంలో నాటుసారా తయారీ మానేసిన వాళ్లంతా ఇప్పుడు మళ్లీ సారా బట్టీల దుమ్ము దులిపారు.

 

నల్లమల అటవీ ప్రాంతం, ఎర్రమల కొండలో పాటు, పలు తండాల్లో సారా తయారీ కొనసాగుతోంది. బెల్లం, నవసాగరం బిల్లలు, తుమ్మ సారా బెరడు కుండలో పులియబెట్టి ఊట తయారు చేస్తారు. ఆ తరువాత వేడిచేసి ఒక ప్రత్యేకపైపు ఏర్పాటు చేసి మరో కుండలోకి పంపుతారు. పైపుద్వారా అవిరి రూపంలో మరో కుండలోకి పంపడం ద్వారా సారా తయారు చేస్తారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురం, కర్నూలులోని బంగారు పేట వాసులకు నాటుసారా కుటీర పరిశ్రమగా మారింది. 

 

డిమాండ్ పెరగడంతో సారా ధర కూడా విపరీతంగా పెంచారు. లీటరు నాటుసారా గతంలో 50 నుంచి 60 ఉండగా ప్రస్తుతం 800 నుంచి వెయ్యి రూపాయలు ఉంది. 20 లీటర్ల క్యాన్ 5వేల వరకు ఉంది. కర్రీ పాయింట్లలో కూరలు ప్యాక్ చేసినట్టు, సారా బట్టీల్లో చిన్న కవర్లలో ప్యాక్ చేసి బైక్ లపై రవాణా చేసి అమ్ముతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: