దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఈరోజు 34 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కొత్త కేసులు నమోదు కాకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. తాజా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు రక్తదాన కార్యక్రమాలు చేపట్టవద్దని ప్రభుత్వం సూచించింది. ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఈరోజు దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. కరోనా వైరస్ రక్తదాన క్యాంపుల వల్ల వ్యాపించే అవకాశం ఉందని భావించి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్చంద సంస్థలు, సేవా సంస్థలు సాధారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటాయి. 
 
 
ఇలాంటి కార్యక్రమాల వల్ల ఒకే చోట జనం గుమికూడే అవకాశం ఉందని భావించి మే 3 వరకు రక్తదాన కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా, ఇతర సమస్యలతో బాధ పడే రోగులకు మాత్రం కొంత వెసులుబాటు కల్పించిందని తెలుస్తోంది. అధికారులు ఈ రోగుల గుర్తింపు కార్డులను పరిశీలించి వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
మరోవైపు రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. ఈ మూడు జిల్లాలలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గుంటూరులో అత్యధికంగా 109 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో 91 కేసులు నెల్లూరు జిల్లాలో 56 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: