తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు డైన‌మిజం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎంత క్రియాశీలంగా ఉంటారో...త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన సిద్ధిపేట విష‌యంలోనూ అంతే ఫోక‌స్ పెడ‌తారు. తాజాగా మ‌రో ఆవిష్క‌ర‌ణ‌ను సిద్ధిపేట కోసం తీసుకువ‌చ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అమలులో భాగమే ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా కోసం ఈ ఆహార యాప్ అందుబాటులోకి తెచ్చారు.

 

ఇంటింటికి నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించేందుకు గాను జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ రూపకర్త మహ్మద్ సభిని మంత్రి అభినందించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. సిద్ధిపేటలో ప్రయోగాత్మకంగా రూపొందించి అమలు పరచిన ఈ యాప్ అమలులో విజయవంతమై జిల్లా వ్యాప్తంగా అమలులోకి తేవాలని సమీక్షలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ..  ప్రజలకు మరింత సౌకర్యవంతంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు.ఇంటి నుంచి ప్రజలెవ్వరు బయటకు రాకుండా ఉంటే వైరస్ లింక్ తెగిపోతుందన్నదని నిపుణులు పేర్కొంటున్నందునే లాక్ డౌన్ ను మరింతగా కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. అందులో భాగంగా నే ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఆహార యాప్ ప్రారంభిస్తున్నామని చెప్పారు.


ఇదిలాఉండ‌గా, తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ జీహెచ్ఎంసీ పరిధిలో ‘పండ్లబుట్ట’ పేరుతో ఇచ్చిన ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. ఒక్కరోజే 2,500 ఆర్డర్లు వచ్చాయి. పండ్ల బుట్ట‌ను అందించేందుకు ఏర్పాటు చేసి కాల్ సెంటర్‌కు 408 కాల్స్, 70 వాట్సాప్ రిక్వెస్టులు వచ్చాయి. భారీ స్థాయిలో ఆర్డ‌ర్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో మార్కెటింగ్ శాఖ సిబ్బంది సైతం చురుకుగా ప‌నిచేస్తున్నారు. ఒక్కరోజే 1,370 చోట్లకు పండ్లు డోర్ డెలివరీ చేశారు. ఆర్డర్ చేసిన 24 గంటల్లో పండ్లు అందుతుండ‌టం ప‌ట్ల వినియోగ‌దారులు సైతం ఖుష్ అవుతున్నారు. కాగా, ఈ పండ్ల బుట్ట విష‌యంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింది. పండ్ల బుట్ట కోసం వినియోగ‌దారులు ఫోన్ చేసే కాల్ సెంటర్ లో ఒకటే నంబర్ ఉన్న కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున 73307 33212కు అదనంగా 9114445555 నంబరు ఏర్పాటు చేసినట్లు మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: