ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నివారణ చర్యలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులతో పాటు... జిల్లా  స్థాయిల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.   క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ... దానికి తగ్గట్టుగా చర్యలు చేపడుతోంది. 

 

ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అంతంతకు పెరుగుతోంది. వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా... కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కృష్ణా వంటి జిల్లాలు ప్రభుత్వాన్ని భయపెడుతున్న పరిస్థితి. దీంతో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం తోపాటు.. చికిత్స కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. 


ప్రస్తుతం ఏపీలో 473 కరోనా పాజిటీవ్‌ కేసులున్నాయి. ఇందులో 125 మంది మహిళలు. వీళ్లలో 80 ఏళ్ల వయస్సు గల పేషెంట్‌తో పాటు మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు ఇద్దరు ఉన్నారు. అలాగే, 15 ఏళ్ల లోపు వాళ్లు 31 మంది ఉన్నారు. దీంతో కేసులు మరింతగా పెరిగితే... బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. అలాగే, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు చర్యలు చేప్టింది. దీంట్లో భాగంగా ఫీవర్ సర్వే, కోవిడ్ సర్వే చేపడుతోంది ప్రభుత్వం.

 

కోవిడ్‌ సర్వేలో కరోనా లక్షణాలు ఉన్న 22 వేల 272 మంది గుర్తించారు. వాళ్లను హోం క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు. వీరి ఆరోగ్య పరిస్తితిని స్థానిక మెడికల్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో ఇంత వరకూ 10 వేల 505 మంది శాంపిళ్లను సేకరించగా, 10 వేల 32 మందికి నెగెటీవ్ రిపోర్టులు వచ్చాయి.  

 

రాష్ట్ర వ్యాప్తంగా 338 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటిల్లో 59 వేల 686 పడకలను సిద్దం చేసింది. ఇప్పటి వరకు 134 మంది డిశార్జి కాగా, ప్రస్తుతం 5 వేల 864 మంది క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారు. గుంటూరులో 32 క్వారంటై సెంటర్లుండగా, వాటిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

మొత్తానికి కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సన్నద్ధమౌతోంది ఏపీ సర్కార్‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: