కరోనా కాలంలో పత్రికలు ఇంటికి రావడమే గగనమైపోయింది. ఇంటికి పత్రిక వచ్చినా జనం వాటిని పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. అబ్బే పత్రికలతో కరోనా వ్యాప్తి అయ్యే ఛాన్సే లేదండీ అని ఆ పత్రికలే తరచూ వార్తలు రాసుకోవాల్సి వస్తోంది. అయినా సరే జనంలో ఏదో ఒక అపనమ్మకం.. చిన్నా చితకా పత్రికలు ముద్రణ కూడా నిలిపేశాయి. మళ్లీ కరోనా తగ్గాక... లాక్‌ డౌన్ ఎత్తేశాక చూసుకుందాంలే.. అన్న ధోరణిలో ఉన్నాయి.

 

 

ఇలాంటి సమయంలో ఈనాడు దిన పత్రిక మాత్రం సొంత పంపిణీ కారణంగా పత్రికను బాగానే అందజేస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఈనాడులో ఓ మార్పు గమనిస్తున్నారా.. ఈనాడులో చాలా మార్పులు వచ్చాయి.. ఏ మార్పు అంటారా.. ఇప్పుడు చెప్పేది చిన్న మార్పే కానీ.. దీని ప్రాముఖ్యత చాలా పెద్దది. ఏ పత్రికకైనా ఎడిటోరియల్ పేజ్ అంటూ ఉంటుంది. అందులో వార్తలు కాకుండా సమకాలీన అంశాలపై విశ్లేషణలు ఉంటాయి.

 

 

ఈనాడు ప్రధాన పత్రికలోని నాలుగో పేజీలో ఈ ఎడిటోరియల్ కథనాలు ఉంటాయి. మిగిలిన పత్రికలకన్నా ఈనాడు ఎడిటోరియల్ పేజీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక అందులో ఎడమ పక్క పొడుగ్గా సింగిల్ కాలమ్‌లో ప్రత్యేకమైన ఫాంట్‌తో ఈనాడు సంపాదకీయం ఉంటుంది. తెలుగులో ఏ పత్రిక సంపాదకీయం కూడా ఇలా ప్రత్యేకంగా కనిపించదు.

 

 

ఇక ఈనాడు సంపాదకీయం అంటేనే ఓ ప్రత్యేకమైన భాషాసంపదతో అలరారుతుంది. కొత్తగ జర్నలిజంలోకి వచ్చే పాత్రికేయులకు అది ఓ పాఠంగా ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రత్యేక సంపాదయకీయం కుచించుకుపోతోంది. అంటే.. గతంలో ఎడమవైపు పొడుగ్గా ప్రధాన సంపాదకీయం.. ఆ పక్కన మరో రెండు విశ్లేషణ కథనాలు, కింద అడ్డంగా అంతర్యామి.. ఆ పక్కనే ఈనాడు లేఖలు ఇదీ ఓ స్టాండర్డ్‌ లే ఔట్.

 

 

మరి ఇప్పుడు ఎందుకో కానీ.. ఈనాడు ప్రధాన సంపాదకీయాన్ని బాగా తగ్గించేసి.. అందులో సగభాగాన్ని అంతర్యామితో నింపేస్తున్నారు. ఇక అంతర్యామి స్థానంలో మరో విశ్లేషణాత్మక కథనం ఇస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే ఓ విశ్లేషణాత్మక వ్యాసం పెరిగింది. అయితే ఈ మార్పు ఎందుకన్నది అంతుబట్టకుండా ఉంది. ఏముందీ రోజూ కరోనాపై ఏం సంపాదకీయాలు రాస్తాం అనుకున్నారా.. లేక.. అంత పొడుగు సంపాదకీయం ఎందుకు అనుకుంటున్నారా.. కరోనా తర్వాత కూడా ఇదే ఫార్మాటు అనుసరిస్తారా.. అన్నది వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: