భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న వేళ అక్క‌డ‌క్క‌డా లాక్‌డౌన్‌పై నిర‌స‌న వ‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి ఇలా ఆందోళ‌న‌ల‌కు దిగుతున్న వారిలో ఎక్కువ‌గా వ‌ల‌స కార్మికులే ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. మ‌హారాష్ట్రలోని బాద్రాలో మంగ‌ళ‌వారం వ‌ల‌స కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఇలా ఆందోళ‌న చేసిన వారిలో ఎక్కువ‌మంది ఉత్తర భార‌త దేశానికి చెందిన‌వారే ఉండ‌టం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్‌ను సుధీర్ఘ‌కాలంపాటు అమ‌లు చేయ‌డంతో తాము తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ భార్య బిడ్డ‌ల‌ను వ‌దిలి ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇక్క‌డ ఉండ‌లేమ‌ని కొంత‌మంది ఏడుస్తూ త‌మ బాధ‌ను వెల్ల‌డిస్తున్నారు. 

 

అయితే ప్ర‌భుత్వం ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేయ‌కుండా లాక్‌డౌన్ తేవ‌డంతో తాము చాలా క‌ష్టాలు ఎదుర్కొంటున్నా మ‌ని వేద‌న చెందుతున్నారు. ఇక్క‌డ ఉన్నా ప‌ని దొర‌క‌డం లేద‌ని, భార్యా పిల్ల‌ల‌కు క‌నీస అవ‌స‌రాల‌కు డ‌బ్బులు పంప‌లేక‌పోతున్నామ‌ని బాధ‌ను వెల్ల‌గ‌క్కుతున్నారు. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ కొన‌సాగింపు కార‌ణంగా ఆందోళ‌న‌కు దిగిన వ‌లస కూలీల‌కు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాక్రే భ‌రోసానిచ్చారు. మ‌హారాష్ట్రలో అంద‌రూ క్షేమంగా ఉంటార‌ని, లాక్‌డౌన్ ఎత్తివేశాక, సొంత ఊళ్లకు వెళ్ల‌వ‌చ్చ‌ని సూచించారు.ముఖ్య‌మంత్రి ఇలా చెబుతున్నా త‌మ‌కు మ‌హారాష్ట్ర‌లో తిన‌డానికి తిండి దొర‌క‌డం లేద‌ని వారంతా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

 

ఈ నేప‌థ్యంలో త‌మ‌ను స్వ‌గ్రామాల‌కు పంపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  మంగ‌ళ‌వారం ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను ఈనెల 14 నుంచి వ‌చ్చేనెల 3 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలియ‌గానే కార్మికులు ముంబై బాంద్రా రైల్వేస్టేష‌న్‌కు చేరుకుని ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం అవ‌స‌ర‌మైతే ఆర్మీ బ‌ల‌గాల‌ను కూడా రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్న‌ట్లు సమాచారం. అయితే వ‌ల‌స కూలీల‌కు కావాల్సిన వ‌స‌తి, ఆహారం క‌ల్పించాల‌ని, ఇందుకు ప్ర‌త్యేకంగా అధికారుల‌తో వింగ్ ఏర్పాటు చేయాల‌ని రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: