మ‌ద్యం.. మందుబాబుల ఇళ్ల‌ను గుల్ల చేసి.. ప్ర‌భుత్వాల జేబులు నింపుతుంది. ఈ మ‌ద్యంతో ఎన్నో కుటుంబాలు.. అందులోనూ సామాన్య పేద కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. మంచి ఆదాయం మార్గం కాబ‌ట్టి ప్ర‌భుత్వాలు కూడా మ‌ద్య నిషేధం విధించ‌లేని ప‌రిస్థితి. అయితే.. దేశంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో మొద‌టి ద‌శ లాక్‌డౌన్ ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు కొనసాగ‌గా.. రెండు ద‌శ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. భార‌త్ ఏకంగా 40రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉంటుంద‌న్న‌మాట‌. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. లాక్‌డౌన్ కాలంలో ఎక్కువ‌గా ఇబ్బందులు ప‌డింది మాత్రం మద్యం ప్రియులు, బాధితులే..! మ‌ద్యం దొర‌క‌క చాలా మంది తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యారు. ఒక ద‌శ‌లో చాలా మంది పిచ్చిపిచ్చి చేసి ఆస్ప‌త్రుల పాలుకూడా అయ్యారు. ఇక హైద‌రాబాద్‌లోని ఎర్ర‌గ‌డ్డ ఆస్ప‌త్రి మ‌ద్యంబాధితుల‌తో నిండిపోయింది. 

 

లాక్‌డౌన్ మొద‌టి ద‌శ‌లో మందుబాబులు, బాధితులు కొంత ఇబ్బందికి గురైనా..రోజులు గ‌డిచే కొద్దీ అల‌వాటుప‌డిపోయారు. మ‌ద్యం లేకున్నా.. హాయిగా కుటుంబ స‌భ్య‌లతో క‌లిసి ఉండేందుకు అల‌వాటుప‌డుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ త‌ర్వాత‌ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్య నిషేధం దిశ‌గా వెళ్తే బాగుంటుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఒక‌వేళ‌.. లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత మ‌ళ్లీ మ‌ద్యం అమ్మకాలు మొద‌లు పెడితే.. అది తీవ్ర దుష్ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌ని చెబుతున్నారు. ఈ న‌ల‌భై రోజుల పాటు మ‌ద్యానికి దూరంగా ఉన్న‌వాళ్లంద‌రూ ఒక్క‌సారిగా షాపుల‌కు ఎగ‌బ‌డే ప్ర‌మాదం ఉంద‌ని, కుటుంబాల‌న్నీ కూడా ఆగం అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్ ఆ దిశ‌గా ఆలోచించాల‌ని సూచిస్తున్నారు. అయితే.. లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌భుత్వాలు వేగంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మ‌ద్యాన్ని నిషేధిస్తాయ‌ని అనుకోవ‌డం అత్యాశే అవుతుంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: