ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈరోజు నమోదైన కేసులతో పాజిటివ్ కేసుల సంఖ్య 493కు చేరింది. ఈ కేసులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 
 
ఏపీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మూడు జిల్లాలలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా కరోనా విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు కరోనా సోకకుండా పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
 
ఈ మూడు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఢిల్లీ ప్రార్థనలకు హాజరయ్యారు. మూడు జిల్లాలలో నమోదైన మెజారిటీ కేసుల్లో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబీకులు, సన్నిహితులే ఉండటం గమనార్హం. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. సీఎం జగన్ ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. 
 
దాదాపు 16 కోట్ల మాస్కులను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించడంతో ప్రభుత్వం కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించి కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. మరోవైపు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అధికారుల కృషి, ప్రజల సహకారం వల్లే ఈ రెండు జిల్లాలలో కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. అధికారులు ఎవరైనా ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి మాత్రమే అనుమతులు ఇస్తూ ఉండటంతో కొత్త కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: