దేశవ్యాప్తంగా మే నెల మూడవ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రతిరోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా పలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.
 
గడచిన 24 గంటల్లో దేశంలో 1400 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాని జిల్లాలు కూడా ఉన్నాయి. ఆయా జిల్లాలకు లాక్ డౌన్ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశంలో దాదాపు 350 జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఏపీలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, మంచిర్యాల జిల్లాలలో కరోనా కేసులు నమోదు కాలేదు. ఏప్రిల్ 20 తర్వాత కేంద్రం ఈ జిల్లాలలో లాక్ డౌన్ నిబంధనలను సడలించనుందని తెలుస్తోంది. దేశంలో మార్చి 24వ తేదీ వరకు 600 కరోనా కేసులు నమోదు కాగా నేటికి ఆ సంఖ్య 11,000కు చేరింది. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
ఏపీలో ఈరోజు 19 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కరోనా పరీక్షల్లో పశ్చిమ గోదావరిలో 8, కర్నూల్ లో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసులతో కలిపి రాష్ట్రం లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నిన్నటివరకు 644 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: