కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. ఆర్థిక స్థితిగతులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వృద్ధి రేటు అంచనాలు తలకిందులవుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజా అంచనాల ప్రకారం ప్రపంచ దేశాలన్నీ మైనస్ వృద్ధిరేటులోకి జారిపోయాయి. భారత్, చైనా, ఇండోనేషియా మినహా అమెరికా, యూరప్ దేశాలన్నీ మైనస్ వృద్ధినే నమోదుచేస్తాయని ఐఎంఎంఫ్ అంచనావేసింది. అంతర్జాతీయ వృద్ధిరేటు మైనస్ 3శాతంగా ఉంటుందని తెలిపింది. 

 

కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1930 ఏడాది మాంద్యం కంటే దారుణమైన పరిస్థితులు ఏర్పాడ్డాయని.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ - ఐఎమ్‌ఎఫ్ తెలిపింది. దీని కారణంగా అంతర్జాతీయంగా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయని వెల్లడించింది. భారత్‌లో 1991 కంటే అత్యంత తక్కువ వృద్ధిరేటు నమోదుచేసే అవకాశం ఉందని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది. ఈ సంవత్సరంలో భారత్‌ జీడీపీ వృద్ధిరేటు 1.9 శాతం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థపై ఐఎమ్‌ఎఫ్‌ తన నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల జాబితాలో చేర్చింది.

 

2020 సంవత్సరానికి కేవలం రెండు దేశాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును నమోదుచేస్తాయని ఐఎంఎఫ్ తెలిపింది. అందులో మొదటి స్థానంలో 1.9 శాతం వృద్ధి రేటుతో భారత్‌ ఉండగా, రెండో స్థానంలో 1.2 శాతం వృద్ధి రేటుతో చైనా ఉంది. 2020 సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటును మైనస్ 3 శాతంగా అంచనా వేశామని.. ఈ ఏడాది జనవరి కంటే ఇది 6.3 శాతం పాయింట్లు కిందకు పడిపోయిందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థిక వేత్త గీతాగోపినాథ్ తెలిపారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో వృద్ధి రేటుపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. 

 

వివిధ దేశాల వృద్ధి రేట్లను ఐఎంఎఫ్ అంచనావేసింది. అమెరికా వృద్ధిరేటు ప్రపంచ సగటుకన్నా తక్కువగా ఉంది. మైనస్ 5.9 శాతానికి అమెరికా వృద్ధిరేటు పడిపోతుందని అంచనావేసింది. ఇక ఇటలీ మైనస్ 9శాతం, స్పెయిల్ మైనస్ 8శాతం, ఫ్రాన్స్ మైనస్ 7.2 శాతం, బ్రిటన్ మైనస్ 6.5 శాతం వృద్ధి రేటు ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఆసియా దేశాల్లో భారత్‌, చైనా, ఇండోనేషియా మినహా మిగిలిన అన్ని దేశాల వృద్ధి రేటు మైనస్‌లోనే నమోదు చేయనున్నట్లు ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. పర్యాటకం, ఆతిథ్యం, వినోదం వంటి రంగాలపై ఆధారపడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కరోనా కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ఐఎమ్‌ఎఫ్ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: