ముంబై బాంద్రా రైల్వేస్టేషన్‌లో వలసకూలీల ఆందోళన, లాఠీచార్జ్.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లాక్ డౌన్ ఎత్తేశారన్న పుకారును నమ్మడంతోనే.. వందలాది మంది వలస కార్మికులు స్టేషన్‌కు చేరుకున్నారని సీఎం ఉద్దవ్ థాకరే తెలిపారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసిన హోంశాఖ మంత్రి అమిత్‌షా.. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 


 
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రధాని మోడీ ప్రకటన .. ముంబై వలస కార్మికుల్లో ఆందోళన నింపింది. ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగిసిందని భావించిన 1500 మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వలస శిబిరాలు, ఆహారం అందించడం సమస్యకు పరిష్కారం కాదని.. స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ ముందు బైఠాయించారు. లాక్‌డౌన్ అమలును ఉల్లంఘించొద్దంటూ పోలీసుల సూచనను వారు పట్టించుకోలేదు. దీంతో.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

 

వలస కార్మికులపై పోలీసుల లాఠీచార్జ్.. రాజకీయ రంగు పులుముకుంది. దీంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే.. వివరణ ఇచ్చారు. లాక్‌డౌనే తప్ప, లాకప్ కాదని వలస కార్మికులకు సూచించారు. ఈ రాష్ట్రంలో మీరు పూర్తి సురక్షితంగా ఉంటారన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన రోజున.. కూలీలు సొంతూర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బాంద్రా ఘటనను రాజకీయం చేయొద్దని ఉద్ధవ్ కోరారు. 

 

బాంద్రాలో వలస కార్మికులు భారీ ఎత్తున గుమిగూడటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసిన అమిత్ షా .. ఇలాంటి పరిణామాలు కోవిడ్-19పై పోరుకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటం వల్ల, కోవిడ్-19పై చేస్తున్న యుద్ధం బలహీనపడుతుందన్నారు.ఇలాంటి ఘటనలు నిరోధించేందుకు పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు మహారాష్ట్ర పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు పెట్టారు. మొత్తం 800నుంచి వెయ్యిమంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు పెట్టినట్టు బాంద్రా పోలీసులు ప్రకటించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: