లాక్‌డౌన్‌ను మే3వ‌ర‌కు పొడ‌గిస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోదీ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌కు సంబంధించిన కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను హోం మంత్రిత్వ‌శాఖ బుధ‌వారం విడుద‌ల చేసింది. కొన్ని రంగాల‌కు ష‌ర‌తుల‌తో కూడిన రిలాక్సేష‌న్‌, ప‌నులు నిర్వ‌హించుకునేందుకు వెసులుబాటునిచ్చింది. ముఖ్యంగా వ్య‌వ‌సాయ‌, దాని అనుబంధ రంగాల‌కు వెసులుబాటు ద‌క్కింద‌నే చెప్పాలి. అయితే ఈ నిర్ణ‌యం వెనుక ఆర్థిక, పారిశ్రామిక రంగాల‌ను చ‌క్క‌దిద్దే విష‌యం ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ముందుగా ప్రాథ‌మిక రంగం ఆ త‌ర్వాత పారిశ్రామిక రంగానికి చివ‌రికి తృతీయ రంగం అంటే సేవ‌ల రంగానికి ద‌శ‌ల వారీగా స‌డ‌లింపు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం యోచిస్తోంద‌ని చెబుతున్నారు. 

 

ప్రాథ‌మికంగా వ్య‌వ‌సాయ రంగానికి దాని అనుబంధ రంగాల‌కు స‌డ‌లింపు ఇవ్వ‌డం వ‌ల్ల గ్రామీణ‌, టౌన్ల వ‌రకు ఇబ్బందులు తలెత్త‌క‌పోవ‌చ్చ‌న్న‌ది కేంద్రం యోచ‌న‌గా తెలుస్తోంది. అలాగే వ్య‌వ‌సాయ ప‌నుల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం వ‌ల‌న ఎక్కువ మంది నిర్బంధం నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి, వ‌చ్చామ‌నే భావ‌న ఏర్ప‌డుతుంద‌ని ఆలోచించిన‌ట్లు తెలుపుతున్నారు. ప‌ట్ట‌ణాల్లో జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో క‌రోనా వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు భావించిన‌ట్లు తెలుస్తంది. అయితే ఈనెల 20 త‌ర్వాత కొన్ని పారిశ్రామిక వాడ‌ల్లో ప‌నులు నిర్వ‌హించుకునేందుకు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. 


అయితే అదీకూడా రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించ‌ని ప్రాంతాల్లో మాత్ర‌మే ఉంటుంది. చివ‌ర‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు ఐటీలో ప‌నిచేస్తున్నారు. ఐటీ సంస్థ‌ల సూచ‌న‌మేర‌కు కొన్ని విభాగాల సిబ్బందికి 50శాతం మేర ఉద్యోగుల‌ను కార్యాల‌యాల‌కు ర‌ప్పించుకునేందుకు వీలు క‌ల్పించింది. అయితే ఏప్రిల్ 20 త‌ర్వాత ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి దాదాపుగా అనుమ‌తిస్తార‌నే ప్ర‌చార‌మైతే ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు క్రమానుగ‌తంగానే లాక్‌డౌన్‌లో స‌డ‌లింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. చైనా ఇదే విధమైన క్ర‌మానుగ‌త లాక్‌డౌన్‌ను పాటించి విజ‌యం సాధించింది. భార‌త్ కూడా డ్రాగ‌న్ కంట్రీని ఫాలో అవుతోంద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: