అదో తెలుగు న్యూస్ ఛానల్.. దానికో ప్రత్యేకత ఉంది. ఏపీ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి నడుస్తున్న ఏకైక.. తొలి ఛానల్ అది. ఏపీ విభజన జరిగి ఆరేళ్లు దాటిపోయినా ఇంకా దాదాపు అన్ని న్యూస్ చానళ్లు హైదరాబాద్ నుంచే నడుస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ కు తరలిపోదామనే ఆలోచన కూడా చేయడం లేదు.

 

 

ఆ మధ్య కొన్ని పత్రికలు, ఛానళ్లు హైదరాబాద్ వెళ్తాయని పుకార్లు వచ్చినా అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అలాంటి నేపథ్యంలో కేవలం ఏపీ ఫోకస్‌గా వచ్చిన చానల్ ఏపీ 24X7.. ఈ ఛానల్‌ కు ప్రధాన స్తంభంగా సీనియర్ జర్నలిస్టు వెంకట కృష్ణ ఉన్నారు. ఈటీవీ నుంచి ప్రస్తానం ప్రారంభించిన వెంకటకృష్ణ.. ఆ తర్వాత కొన్ని ఛానళ్లు మారి ఎక్కువ కాలం టీవీ 5లో పని చేశారు. ఆ తర్వాత ఏపీ 24X7 కు ప్రాణం పోశారు.

 

 

తెలుగులో మీడియా డిస్కషన్లలో గర్జించే యాంకర్ గా పేరు తెచ్చుకున్నారు. నేషనల్ న్యూస్ ఛానళ్లలో ఆర్ణబ్ గోస్వామి తరహాలో తెలుగులో యాంకర్లు లేరన్న లోటను ఆయన తీరుస్తూ వచ్చారు. అయితే కేవలం ఏపీ ఫోకస్ గా వచ్చిన ఈ ఛానల్ బాగా నడుస్తుందనే అంతా అనుకున్నారు. అందులోనూ వెంకట కృష్ణకు ఆర్థికంగా బలంగా ఉన్న.. గతంలో మాటీవీ ను ప్రారంభించిన మురళీ కృష్ణంరాజు ఛైర్మన్ గా అండగా నిలవడంతో ఇక ఈ ఏపీ 24X7 కు తిరుగులేదనుకున్నారు.

 

 

కానీ.. ఈ ఛానల్ ఆశించినంత సక్సస్ కాలేదు. అంతే కాదు.. సిబ్బంది మధ్య విబేధాలతో రోజురోజుకూ పరిస్థితి దిగజారింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు తయారవడంతో.. ఇటీవల తాను ఈ ఛానల్ చైర్మన్ గా తప్పుకుంటున్నానని ఆ ఛానల్ ఛైర్మన్ మురళీ కృష్ణంరాజు ఓ బహిరంగ లేఖ ద్వారా తెలిపారు. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే.. తాజాగా ఆ చానల్ నుంచి వెళ్లిపోయేందుకు వెంకటకృష్ణ అంగీకరించారట. వెంకటకృష్ణ చానల్ నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించడంతో ఛైర్మన్ మురళీ కృష్ణంరాజు చైర్మన్ కమ్ మేనిజింగ్ డైరక్టర్‌గా మరోసారి బాధ్యతలు తీసుకున్నారట. మరి వెంకటకృష్ణ మళ్లీ ఏ ఛానల్లో తెలతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: