నిత్యం లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించే టీటీడీ.... లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్న ఆపన్నులను ఆదుకునేందుకు ముందుకు వస్తోంది. ఇప్పటికే తిరుపతిలో రోజూ లక్షా ముప్పై వేల మందికి ఆహార పోట్లాలు పంపిణి చేస్తున్న టీటీడీ.. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతి జిల్లాకు కోటి రూపాయలు కేటాయించి.... జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్నప్రసాదం అందించాలని భావిస్తోంది. 

 

ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద వితరణ కేంద్రం.. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉంది. ప్రతిరోజూ ఇక్కడ లక్షలమంది భక్తులు భోంచేస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా కొండమీదకు భక్తుల రాకను నిలిపివేయడంతో... అన్నప్రసాద కేంద్రం కూడా మూతపడింది. అయితే ఈ అన్నప్రసాద  వితరణ కేంద్రం ద్వారా.. తిరుపతిలోని నిరుపేదల ఆకలి తీర్చాలని ఎమ్మెల్యే భుమాన కరుణాకర్‌రెడ్డి ప్రతిపాదన 
పెట్టడంతో టిటిడి సానుకూలంగా స్పందించింది.

 

ప్రతిరోజూ లక్షా ముపై వేల ఆహర పోట్లాలను పంపిణికి సిద్దం చేసింది టీటీడీ. లాక్ డౌన్ కారణంగా టిటిడి ఉద్యోగులు ఇంటికే పరిమితం అవ్వడంతో.. ఈ పంపిణీ ఇబ్బందిగా మారింది. అయితే కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు రావడంతో.. తిరుపతిలో వున్న 50 డివిజన్లలో.... పది మంది చొప్పున సిబ్బందిని కేటాయించి ఆపన్నులుకు ఆహర పోట్లాలును పంపిణి చేస్తోంది టీటీడీ. మధ్యాహ్నం సమయంలో సాంబారు రైస్, టోమాటా రైస్, బిస్ బేలా బాత్, పెరుగన్నం.... రాత్రి సమయంలో ఉప్మా, పొంగలి పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తోంది. 

 

ఆహర పోట్లాల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రగిరి, శ్రీకాళహస్తికి విస్తరించింది టీటీడీ. తిరుపతిలోని శ్రీనివాసం, శ్రీపద్మావతి కళాశాల, తిరుచానురులోని పద్మావతి నిలయం వంటశాలలో ఆహార పొట్లాలను తయారు చేస్తోంది. తిరుపతి లో 80వేల మందికి, చంద్రగిరిలోని 40 వేల మందికి, శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోని 10 వేల మందికి ఆహర పొట్లాలను పంపిణీ చేస్తోంది. అయితే, కేంద్రం లాక్ డౌన్ ని మే 3 వరకు పోడిగించడంతో.. ఈ ఆహార పొట్లాల వితరణను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది టీటీడీ. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆపన్నులుకు అన్నప్రసాదం అందించేందుకు ..ఒక్కో జిల్లాకు  కోటి రూపాయలు కేటాయించింది. 

 

తన సన్నిధికి వచ్చే భక్తులకు ఆకలి తీర్చే.. ఆపదమొక్కుల వాడు.. ఇప్పుడు కరోనా కల్లోలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపన్నులకు ఆహారాన్ని పంపిస్తున్నాడు. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: