రాష్ట్రంలో ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్‌లో 20వ తేదీ త‌ర్వాత మార్పులు  ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. మే3 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌తాధికారులో రాష్ట్రంలో అమ‌లవుతున్న లాక్‌డౌన్ తీరుపై స‌మీక్ష నిర్వ‌హించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వంటి అంశాల‌పై స‌మీక్షలో చ‌ర్చించారు.  

 

ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని అన్నారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా స‌న్న‌ద్ధ‌మై ఉంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 553 మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డి చికిత్స పొందుతున్నార‌ని అన్నారు. వీరిలో బుధవారం 8 మంది కోలుకుని ఇంటికి పంపించిన‌ట్లు తెలిపారు.  అలాగే 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు. వైర‌స్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు వీలుగా రాష్ట్రంలో 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 

 

రాష్ట్రంలో 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే 5 లక్షల కిట్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. అలాగే మరో 5 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చామ‌ని,  ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులున్న‌ట్లు తెలిపారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ నెల 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యథావిథిగా కొనసాగుతుందని అన్నారు. 20త‌ర్వాత స‌మీక్ష అనంత‌రం కొన్ని మార్పుల‌కు అవ‌కాశం ఉండే అవ‌కాశం ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెల్ల‌డించారు. అయితే ప్రజలు ఎప్పటిలాగానే సహకరించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: