కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యథావిథిగా కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. లాక్ డౌన్ అమలు, నిరుపేదలక సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిథులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం యధావిధిగా  కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

 

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.  కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 553 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు.  

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతున్నదని చెప్పారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిథిగా లాక్ డౌన్ అమలవుతుంది, తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటిలాగానే సహకరించాలన్నారు. ఈ నెల 20 వతేదీ  వరకు కరోనా వైరస్ కట్టడి చేయగలిగితే , లాక్ డౌన్ ను సడలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది   . 

మరింత సమాచారం తెలుసుకోండి: