దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపుతో రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 14 వరకే లాక్ డౌన్ అని చెప్పిన ప్రభుత్వం కరోనా ప్రభావం ఎక్కువ అవుతుండడంతో మే 3 వరకు పెంచింది. విశాఖలో ఇప్పటికే నెలరోజుల పాటు ఎలాంటి పనిలేక ఖాళీగా ఇళ్లకే పరిమితమైన దినసరి కూలీలు..ఓ వైపు ఇంటి అద్దెలు కట్టలేక, తమ కుటుంబాలను పోషించడానికి చేతిలో డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. 


కరోనా నియంత్రణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రోజువారి కూలీలకు శాపంగా మారింది. రోజు ఏదో పనికి వెళ్తెగాని పూట గడవని కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. రోజంతా కష్టపడితే రూ.200 నుండి 300 సంపాదించే కూలీలు ఇప్పడు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో బిక్కుబిక్కు మంటున్నారు. వారందరికీ ఇప్పుడు ఆదాయం వచ్చే మార్గమేదీ లేదు. తిండికి, ఇంటి అద్దెకు డబ్బులు లేక దిగులుపడుతున్నారు.

 

లాక్ డౌన్ విధించడంతో ఎక్కువగా నష్టపోయిన వారిలో వలస కూలీలు, రోజు వారీ కూలీలు ఉన్నారు.  కోవిడ్‌19 వైరస్‌ ప్రభావం అడ్డా కూలీలపై కూడా పడింది. సాధారణ రోజుల్లో అంతంత మాత్రంగా దొరికే కూలీ పనులు ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ దెబ్బతో అడ్డా కూలీలను మరింత కుంగదీస్తోంది. రోజు పొద్దున్నే తిన్నా.. తినకపోయినా అడ్డాల మీదికి చేరుకునే రోజువారి కూలీలకు నెల రోజులుగా పనులు దొరకడం లేదు. దీంతో ప్రతిరోజు ఉదయం అడ్డాలకు చేరుకోవడం.. పనులు దొరక్కపోవడంతో నిరాశతో ఇళ్లకు చేరడం పరిపాటిగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ వైరస్‌ ప్రభావంతో విశాఖలోని పలు ప్రాంతాల్లో గృహ నిర్మాణం పనులు కూడా సన్న గిల్లాయి. దీంతో రోజు వారి అడ్డా కూలీలకు కూలీ పనులు దొరకడం గగనంగా మారింది.  

విశాఖలో వేలాదిమంది కూలీలు వలసలు ద్వారా వచ్చిన వారే..వీరంతా రోజూ ఏదో ఒక చోట పని చేసుకుంటూ రోజూ వారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం నుండి వచ్చి తమ కుటుంబాలతో ఉంటున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో చేతిలో చిల్లి గవ్వ లేకుండాపోయింది. నిత్యవసర వస్తువులు కొందామంటే డబ్బులు లేక పిల్లాపాపలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పోని ఊరెళ్దామంటే ప్రజారవాణను పూర్తిగా నిలిపివేశారు. రేషన్ సరుకులు అయినా ఇక్కడ తీసుకుందామంటే తమ సొంత ఊళ్లలో తప్ప వేరే చోట్ల ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు కూలీలు. లాక్ డౌన్ కాలం ఈ వలసకూలీలకు శాపంగా మారింది. ఎప్పుడు ఈ లాక్ డౌన్ పూర్తవుతుందా.. తమ కష్టాలు తీరతాయా అని వారు ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: