కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి రాండమ్‌ టెస్టులు నిర్వహించాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని... ఇంటింటికీ వెళ్లి శాంపిల్స్‌ సేకరించనున్నారు. అలాగే, క్వారంటైన్‌ పూర్తి చేసిన పేదలకు 2 వేల రూపాయలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌.

 

లాక్‌డౌన్‌ విధించడంతో పాటు సామాజిక దూరం వంటి చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. దీంతో కరోనా ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా మూసి... అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్‌ వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా విస్తరణ, నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్‌ కేసులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. రాష్ట్రంలో 3 విడతలుగా నిర్వహించిన కుటుంబ సర్వేలో గుర్తించిన సుమారు 32 వేల మంది కరోనా అనుమానితుల్ని గుర్తించారు. వీరందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు.

 

ఇళ్ల వద్దకే వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని... ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా ధైర్యంగా శాంపిల్స్‌ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ కోరింది. అలాగే, అనుమానితుల వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించింది. పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరాన్ని బట్టి క్వారంటైన్ సెంటర్లకు గాని, ఆస్పత్రులకు గాని తరలిస్తారు. అలాగే, వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం... అవసరమైతే ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని సూచిస్తోంది.  

 

క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న పేదలకు 2 వేల రూపాయలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రస్తుతం రోజుకు 2 వేలకు పైగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి... దీనిని 4 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై ఆరా తీశారు సీఎం. మంచి ఆహారం, మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

 

లాక్ డౌన్ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోకుండా సత్వర మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నిత్యావసర వస్తువులు, వంటనూనెల ధరలపై దృష్టిపెట్టాలని, ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. 

మరింత సమాచారం తెలుసుకోండి: