కందుకూరి వీరేశలింగం ఒక వ్యక్తి కాదు మహోన్నత శక్తి బాల్యవివాహాల రద్దుకోసం ఉద్యమించిన మహోన్నతుడు. 1848 ఏప్రిల్ 16 సాహిత్య రాజధాని రాజమహేంద్రవరంలో జన్మించిన కందుకూరి ప్రస్తావన లేకుండా రాజమహేంద్రవర చరిత్ర పూర్తి కాదు. బాల్యవివాహాలు నిరసిస్తూ ఆయన పెద్ద ఎత్తున చేప్పట్టిన ఉద్యమం ఒక చరిత్ర. దీనితోపాటు సామాజిక దురాచారాల నిర్మూలన కోసం నిరుపమానంగా కృషిచేసిన వీరేశలింగంకు ఆంధ్రుల చరిత్రలో సముచితమైన స్థానం ఉంది. 


సంఘ సంస్కర్త గా రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. బాల్య వివాహాలు రద్దు కోసం ఉద్యమిస్తూనే వితంతు వివాహాలు జరిపించాలని కోరేవాడు దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించింది ఆయనే. దీనికితోడు సాహితీ వ్యాసంగంలో కూడ విశేషంగా కృషిచేశారు. తెలుగులో తొలి నవల వ్రాయడమే కాకుండా తెలుగులో మొదటి స్వీయ చరిత్ర రాసింది కూడా కందుకూరి అని చరిత్ర కారులు చెపుతారు. అంతేకాదు తొలి ప్రహసనం కూడ ఆయనే వ్రాశారు. కందుకూరి జయంతిని నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు.


ముఖ్యంగా స్త్రీలకు స్వేచ్ఛ విషయంలో ఆయన నిరంతర పోరాటం చేసారు. జీవిత కాలంలో 130 రచనలు చేసారు. ప్రహసనాలు నాటకాలు అటు సంస్కృతం ఇటు ఆంగ్లం నుంచి అనువాద నాటకాలు ఇలా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పత్రికలు నడపడంలో సంఘ సంస్కరణ ఉద్యమంలో దక్షిణాదిన జాతీయస్థాయి కృషి చేసిన మహోన్నత వ్యక్తి. కొంతమంది స్నేహితుల సహాయంతో రాజమండ్రిలోనే ముద్రణశాల నెలకొల్పి అనేక పుస్తకాలు ముంద్రించడమే కాకుండా ‘వివేక వర్ధిని’ లాంటి ఒక సంచలన పత్రికను ఆరోజులలో వీరేశలింగం నడిపారు అంటే ఆయన సామాజిక చైతన్యం అందరికీ అర్ధం అవుతుంది. 

 

హిందూ సంస్కృతిలో విధవా వివాహం పురాణాల్లోనే ఉంది అని తెలిపేందుకు ఎన్నో ప్రాచీన ఉదాహరణలను చూపెడుతూ ఆనాటి ఛాందస వాదులతో చనిపోయే వరకు అలుపెరుగని పోరాటం చేసారు. ఈయన చేస్తున్న సంఘ సంస్కరణలు వ్యతిరేకించి ఆనాటి రాజమండ్రిలోని ఛాందసవాదులు ఈయన ఇంటికి నీళ్ళు కూడ రాకుండా కట్టడి చేస్తే ఆయన భార్య కందుకూరి వజ్ర సంకల్పానికి నిలువెత్తు రూపం రాజ్యలక్ష్మమ్మగారు గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వారట. ఆరోజులలో ఆయన చేసే సాంఘీక ఉద్యమాలు బెంగాల్‌ లోని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాయిలో ఉండటంతో కందుకూరి ని దక్షిణాది ఈశ్వర్ చందర్ విద్యాసాగర్ అని పిలిచేవారు. ఇలా ఎన్నో సామాజిక స్పూర్తిని కలిగించిన కందుకూరి జీవితం నేటితరానికి ఆదర్శప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: