దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ మోదీ లాక్ డౌన్ ను పొడిగించడంతో రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథాతథంగా లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా లాక్ డౌన్ లో మార్పులు చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల సహకారం వల్ల లాక్ డౌన్ బాగానే అమలవుతోందని చెప్పారు. 
 
నిన్న కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలు గురించి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో . మంత్రి ఈటల రాజేందర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా సోకిన వారు ఎంత మంది ఉన్నా వారికి చికిత్స అందించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సీఎంకు అధికారులు చెప్పారు. 
 
నిన్న కరోనా నుంచి కోలుకుని 8 మంది డిశ్చార్జ్ కాగా ఈరోజు 128 మంది డిశ్చార్జ్ కానున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 259 కంటైన్మెంట్ జోన్లను సిద్ధం చేశామని... పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని కేసీఆర్ అన్నారు. వైద్య సిబ్బంది కోసం 2.25 పీపీఈ కోట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 
 
ఈ మాస్కులకు తోడు మరో 5 లక్షల మాస్కుల కొరకు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు కరోనా కట్టడి కోసం బాగా కృషి చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు 308 కోట్ల రూపాయలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు 148 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: