ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నటివరకు రాష్ట్రంలో 525 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14కు చేరింది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో నమోదైన కేసుల్లో మెజారిటీ కేసుల్లో కరోనా లక్షణాలు కనిపించడం లేదు. 
 
వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినా దాదాపు 100 మందికి కరోనా నిర్ధారణ కావడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టుల్లోనూ వీరికి కరోనా నిర్ధారణ అయింది. ఈ వంద మందిలో జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కనిపించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా బాధితుల్లో జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర కరోనా లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. 
 
అయితే గుంటూరు జిల్లాలోని మెజారిటీ కేసుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేశారు. జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరై వచ్చిన వారి వల్ల జిల్లాలో కాంటాక్ట్ కేసులు పెరిగిపోయాయి. కొన్ని కేసుల్లో అధికారులు కాంటాక్ట్స్ ను గుర్తిస్తే తప్ప కరోనా సోకిందో లేదో తెలియడం లేదు. 
 
జిల్లాలో చాలా మంది కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. దీని వల్ల జిల్లాలో కాంటాక్ట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరైనా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని, వారి కుటుంబ సభ్యులను కలిస్తే స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కరోనా పరీక్షలు చేయించుకోవడం అవమానంగా భావించవద్దని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: