దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పేరు వినబడితే చాలు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలందరికీ కీడు చేస్తున్న కరోనా వల్ల కొందరికి మాత్రం మేలు చేకూరుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నీరవ్ మోదీకి కలిసొస్తోంది. లాక్ డౌన్ వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిలువునా ముంచి లండన్ పారిపోయిన నీరవ్ కేసు విచారణలో జాప్యం జరుగుతోంది. 
 
కరోనా వ్యాప్తి వల్ల మన దేశంతో పాటు లండన్ లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. అందువల్ల మన దేశ బృందాలు లండన్ కు వెళ్లడం కష్టమవుతోందని... నీరవ్ అప్పగింతలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఒక ప్రభుత్వ అధికారి మీడియాతో మాట్లాడుతూ లండన్ కోర్టులో నీరవ్ మోదీని భారత ప్రభుత్వానికి అప్పగించే విషయమై తదుపరి విచారణ 11వ తేదీన ప్రారంభం కానుందని తెలిపారు. 
 
లండన్ కోర్టు లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపే అవకాశాన్ని పరిశీలిస్తోంది. గతేడాది మార్చి 20న నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నీరవ్ మోదీని అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది. నీరవ్ మోదీ రైతులను కూడా మోసం చేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన యాజమాన్యంలోని ఒక కంపెనీ మహారాష్ట్రలోని గోయ్‌కరవడా, కాప్‌రేవడి, ఖండాలా గ్రామాలలో భూములు కొనుగోలు చేసింది. 
 
భూములు కొనుగోలు చేసిన కంపెనీకి నీరవ్ మోదీ డైరక్టర్ గా ఉన్నారు. ఈ భూములను చాలా తక్కువ ధరకు తమ నుంచి కొన్నారని తమ భూములను తమకే ఇప్పించాలని గతంలో రైతులు విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల ప్రపంచానికి చేటు జరుగుతుంటే నీరవ్ మోదీకి మాత్రం మేలు జరుగుతోంది. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,000 దాటింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,000కు చేరువవగా కేరళ రాష్ట్రంలో నిన్న కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: