కరోనా మహమ్మారి అగ్ర రాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ కేసులు నమోదు కావడంతో పాటు ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. గత కొన్ని రోజుల నుంచి అగ్ర రాజ్యంలో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆగిపోవడం.... ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల గురించి కేంద్రం దృష్టి పెట్టకపోవడంతో విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడే ఉండిపోయారు. 
 
సుప్రీంకోర్టులో పలువురు విదేశాల్లో ఉన్న భారతీయులను ఇండియాకు రప్పించేలా కేంద్రం చొరవ చూపించాలని పిటిషన్లు దాఖలు చేసినా సుప్రీం కోర్టు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వారిని ఇండియాకు రావడానికి అనుమతించలేదు. విదేశాల్లో ఉన్న భారతీయులకు కొన్ని సంస్థలు సహాయ సహకారాలు అందిస్తుంటే మరికొన్ని సంస్థలు మాత్రం మొండిచెయ్యి చూపుతున్నాయి. కొందరి వీసా గడువు ముగియడంతో ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. 
 
అయితే తాజాగా వీరి విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్స్ విభాగం తెలిపింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ఈ మేరకు వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను పోస్ట్ చేసింది. వీసాల పొడిగింపు అభ్యర్థనలను చాలా వేగంగా పరిష్కరిస్తామని ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది.

 

అయితే గడువు పొడిగింపుకు సంబంధించిన సాక్ష్యాలను దరఖాస్తుదారుడు సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. గత వారం హెచ్ 1 బీ, ఇతర వీసాల గడువును పొడిగించాలని కేంద్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరగా అగ్ర రాజ్యం భారత్ కు శుభవార్త చెప్పింది. అమెరికా ప్రభుత్వం హెచ్ 1బీ దరఖాస్తుదారులు ఉద్యోగం కోల్పోయినా వారి దరఖాస్తు గడువును 60 రోజుల నుంచి 8 నెలల వరకు పొడిగించనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: