కరోనా ప్రభావం ప్రపంచంపై దారుణంగానే ఉండేలా కనిపిస్తోంది. అసలు కరోనా భయం ఎప్పుడు వదులుతుందో తెలియకుండానే.. దాని ప్రభావం గురించి వస్తున్న వార్తలు వింటే గుండె గుభేలు మంటోంది. ఇది అది అని కాకుండా అన్ని రంగాలనూ కరోనా ప్రభావితం చేస్తోందంటే అతిశయోక్తి కాదు.. అయితే అన్నింటి కంటే ఎక్కువగా కరోనా ప్రభావం టూరిజంపై ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌’ వేస్తున్న అంచనాలు మరీ భీతి గొలుపుతున్నాయి. ఇండియాలో పర్యటన, పర్యాటక రంగాలపై ఆధారపడి బతుకుతున్న దాదాపు 90 లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ కౌన్సిల్ అంచనా వేసిందట. అంటే దాదాపు కోటి మంది.. ఒక విధంగా చెప్పాలంటే ఇది గోవా జనాభాకన్నా ఆరింతలు ఎక్కువ. దీనికి తోడు లాక్ డౌన్‌ ను మే 3 వరకూ పొడిగించడం టూరిజం రంగంపై మరింత ప్రభావం చూపుతోంది.

 

 

మే 3వ తేదీ వరకు దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల పర్యాటక, ప్రయాణ రంగాలు తీవ్రంగా దెబ్బ తింటాయని, ఈ రంగాలు పూర్తిగా కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఇప్పుడే చెప్పలేమని ఇప్పటికే పలు ట్రావెల్‌ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఇండియాలో టూరిజం రంగానికి సంబంధించిన గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. కేంద్ర పర్యాటక శాఖ 2019–2020లో విడుదల చేసిన వార్శిక నివేదిక ప్రకారం 2018–19 సంవత్సరం నాటికి దేశంలో 8.70 కోట్ల మంది పర్యాటక రంగంపై ఆధారపడి బతుకుతున్నారు.

 

 

అంటే టూరిజం దేశంలోనే అత్యధికంగా ఉపాధి అందిస్తున్న రంగాల్లో ఒకటి. దేశంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 12.75 శాతం. టూరిజానికి అనుబంధంగా ఉండే కార్పొరేట్‌ సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు నిలిచి పోవడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. ఇవన్నీ కోలుకుని మళ్లీ ప్రపంచం ఓ గాడిన పడాలంటే ఎంత సమయం పడుతుందో ఏంటో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: