దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 250 పైగా కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్ లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించడంతో వచ్చే నెల 3 వరకు ప్రజలు తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
నగరంలో అత్యవసర సేవల సిబ్బంది మినహా పోలీసులు ఇతరులకు అనుమతి ఇవ్వడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ నగర రోడ్లు నేడు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో వ్యాపార, వాణిజ్య సేవలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేసినా నగరంలో నమోదైన కేసుల దృష్ట్యా మే నెల 3 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని తెలుస్తోంది. 
 
అప్పటివరకు నగరంలో లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదని సమాచారం. మే 3వ తేదీలోపు కరోనాను నియంత్రించలేకపోయినా, కేసుల సంఖ్య భారీగా పెరిగినా నగరంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి, వైద్య సేవలకు మాత్రమే ప్రజలను రోడ్లపైకి అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గూడ్స్ వాహనాలకు మాత్రం పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. 
 
కేంద్రం జనం గుమికూడకుండా ప్రజలకు నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులు అందేలా కొన్నింటికి అనుమతులు ఇచ్చింది. పోలీసులు రోజంతా ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. కేంద్రం ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇస్తామని ప్రకటనలు చేసినప్పటికీ నగరంలో నమోదైన కేసుల దృష్ట్యా నగరంలో ఎటువంటి ఆంక్షలు సడలించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.           

మరింత సమాచారం తెలుసుకోండి: