టీవీ5.. తెలుగులో టాప్ 5 న్యూస్ ఛానళ్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి స్థిరమైన రేటింగ్స్ సాధిస్తున్న న్యూస్ ఛానల్. న్యూస్ ఛానళ్లలో టీవీ9 ఎప్పుడూ మొదటి స్థానం సంపాదించుకుంటుండగా.. టీవీ5 సెకండ్ ప్లేస్‌లో కొనసాగేది. ఆ తర్వాత స్థానంలో ఎన్టీవీ.. ఇక ఆ తర్వాత స్థానాల్లో సాక్షి, ఏబీఎన్, వీ6 ఇతర ఛానళ్లు ఉంటుండేవి. కానీ కొంత కాలంగా టీవీ5 రేటింగ్స్ నానాటికీ దిగజారుతూ వస్తున్నాయి.

 

 

ఒకానొక సమయంలో టీవీ9కు టీవీ5 గట్టి పోటీ ఇచ్చింది.. కొన్నాళ్లు.. అంటే అతి తక్కువ వారాలు ఫస్ట్ ప్లేస్ లో కూడా కొనసాగినట్టు గుర్తు. అలాంటి టీవీ5 పరిస్థితి ఇప్పుడు రోజురోజు కూ దిగజారుతోందనే చెప్పాలి. ఇందుకు ఈ వారం రేటింగ్స్ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ వారం ఓవరాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల కంబైన్డ్ రేటింగ్స్ చూస్తే 173617 పాయంట్లతో టీవీ9 ఎప్పటిలాగానే మొదటి స్థానం సంపాదించుకుంది.

 

 

కొన్నాళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తున్న వీ6 92879 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 85792 పాయింట్లతో ఎన్టీవీ మూడో స్థానంలో నిలవగా... 65910 పాయింట్లతో టీవీ5 నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ర్యాంకులు కాసేపు పక్కకు పెట్టి పాయింట్ల వారీగా అంచనా వేస్తే.. టీవీ5 రేటింగ్స్ టాప్ ఛానల్ టీవీ9 రేటింగ్స్ లో దాదాపు మూడో వంతు మాత్రమే సాధించిందని చెప్పాలి.

 

 

మరి ఇలా ఎందుకు జరుగుతుందన్న దానిపై ఆ ఛానల్ ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిదేమో. ఇటీవలి కాలంలో టీవీ9 ఛానల్ తెలుగు దేశం పార్టీని సపోర్ట్ చేయడంలో ఆస్థాన ఛానల్ గా ముద్రపడిన ఏబీఎన్‌ ను మించిపోతోందన్న విమర్శలు మీడియా సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. మరి అదేమైనా ఈ రేటింగ్స్ పై ప్రభావం చూపిందా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: